తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే వుంటారు. గ్లామర్ ను మాత్రమే నమ్ముకుని వచ్చినవారు .. పరాజయాలతోనే ఎక్కువసార్లు ప్రయాణం చేసినవారు .. కొన్ని సినిమాలు చేసిన తరువాత కనుమరుగవుతుంటారు. అభినయం పరంగాను రాణిస్తూ విజయాలను అందుకున్నవారు అగ్రస్థానానికి చేరుకుంటూ వుంటారు. అలా గ్లామర్ పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ, సక్సెస్ లు పలకరించని కారణంగా వెనుకబడిపోయిన కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపిస్తుంది. స్టార్ స్టేటస్ దిశగా ఆమె దూసుకుపోతుందని అభిమానులు అనుకుంటే, మధ్యలోనే ఆమె జారిపోయింది.
‘మజ్ను‘ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన ఈ అమ్మాయి, గ్లామర్ పరంగా కుర్రాళ్లను ఆకట్టుకుంది. అల్లరి కళ్లు .. మనసులను ఖాళీ చేసే చూపులు .. విల్లు వంచినట్టుగా వుండే పెదాలు .. మంత్రం వేసే మందహాసం ఈ అమ్మాయికి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. దాంతో కుర్రాళ్లంతా తమ గుండె గుమ్మాలపై ఆమె ఫోటోనే అంటించేసుకున్నారు. అనూకి వచ్చిన క్రేజ్ ఆమెకి వరుసగా అవకాశాలను తెచ్చిపెట్టింది. ఏకంగా పవన్ కల్యాణ్ మూవీ ‘అజ్ఞాతవాసి‘లోను ఆమెకి చోటు దక్కింది .. కానీ సక్సెస్ మాత్రం చిక్కలేదు.
Also Read ;- సిద్ధార్థ వస్తానంటే శర్వానంద్ వద్దంటారా?
ఒక స్టార్ హీరో జోడీగా చేసిన సినిమా సక్సెస్ కాకపోతే, ఎలాంటివారైనా డీలాపడిపోతారు. అనూ ఇమ్మాన్యుయేల్ విషయంలోను అదే జరిగింది. కాకపోతే ‘నా పేరు సూర్య’ .. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలు తన కెరియర్ ను కాపాడతాయని ఆమె భావించింది. కానీ దురదృష్టవశాత్తు ఆ రెండు సినిమాలు సరిగ్గా ఆడలేదు. దాంతో సహజంగానే అనూ ఇమ్మాన్యుయేల్ కి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆమె కెరియర్లో గ్యాప్ ను కూడా తీసుకొచ్చాయి. అభిమానులు మాత్రం ఏ ప్రాజెక్టులోనైనా ఆమె పేరు వినిపించకపోతుందా అనే ఆశతో ఎదురుచూస్తూనే వున్నారు.
ప్రస్తుతం ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా చేస్తున్న ‘అల్లుడు అదుర్స్‘ అనే సినిమాలో కథానాయికగా నటిస్తోంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, తన పాత్ర అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో వుంది. మాస్ ను .. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ఈ యాక్షన్ కామెడీ సినిమా, వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది. ఇక ఆ తరువాత సినిమాగా ఆమె ‘మహాసముద్రం‘ చేయనుంది. శర్వానంద్ – సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా ప్రాధాన్యత కలిగిన పాత్రను పోషించనుంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే రానుంది. కొంత గ్యాప్ తరువాత అనూ ఇమ్మాన్యుయేల్ చేస్తున్న ఈ సినిమాలతోనైనా ఆమెకి అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి.
Must Read ;- అఫీషియల్ : ‘మహాసముద్రం’లో సమ్మోహన సుందరి