ఏపీలో అధికార పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఏపీలో అధికారమే లక్ష్యంగా సాగిన వైసీపీ, పార్టీ నేతలు, పార్టీ సోషల్ మీడియా విభాగం.. 2019 ఎన్నికల్లో జగన్ విక్టరీ కొట్టగానే.. ఇక తమకు ఎదురు లేదన్నట్లుగా భావించారు. జగన్ సీఎంగా ఉండగా తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా సాగారు. అయితే జగన్ పరిధి ఏ మేరకన్న విషయం మాత్రం వారికి అంత తొందరగా తెలియరాలేదనే చెప్పాలి. అందుకే కాబోలు.. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసిన హైకోర్టుపైనా, అందులోని జడ్జీలపైనా వైసీపీ సోషల్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో జగన్ తన సోషల్ మీడియా టీం సభ్యులను గాలికి వదిలేయగా.. ఈ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా వారికి తెలియడం లేదు. మొత్తంగా వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు ఓ విపత్కర పరిస్థితినే ఎదుర్కొంటోందని చెప్పాలి. ఇలాంటి తరుణంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా.. వైసీపీ సోషల్ మీడియా వింగ్ లో యమా యాక్టివ్ గా ఉండే ఎన్నారై పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తికి డిల్లీ పోలీసులు తమదైన శైలి రివర్స్ పంచ్ ఇచ్చారు. అతడిపై కేసు నమోదు అయిపోయింది.
ఇంతకూ ఏం చేశాడంటే..?
వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికంతా జగన్ అంటే ఓ మానవాతీతుడి కింద లెక్క కదా. జగన్ పై ఎవరు విమర్శలు సంధించినా.. వీరు తట్టుకోలేరు. అదో రకమైన మనస్తత్వం. అలాంటి గ్రూపులో మస్తు యాక్టివ్ గా ఉండే పంచ్ ప్రభాకర్.. జగన్ పై విమర్శలు సంధించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వరుసగా మీడియా సమావేశాలు పెట్టి మరీ తప్పుబడుతున్న వైనంతో ఓ పిచ్చోడిలా మారిపోయాడట. అంతే.. రఘురామరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేశాడు. అంతటితో ఆగని ప్రభాకర్ వైసీపీ కోరినట్లుగా రఘురామపై సస్పెన్షన్ వేటు వేయడం లేదన్న కారణంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను టార్గెట్ చేస్తూ ఆయనపైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇక దేశ ద్వితీయ పౌరుడిగా ఉన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడిపైనా ప్రభాకర్ తనదైన శైలి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను విడుదల చేశాడు.
రఘురామ ఫిర్యాదుతో..
తనపై విమర్శలు చేస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి నేతలనే వదలని రఘురామకృష్ణరాజు.. ఇక పంచ్ ప్రభాకర్ ను వదిలిపెడతారా? అంతేకాకుండా తనపైనే కాకుండా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వెంకయ్యనాయుడు, ఓం బిర్లాలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచ్ పై ఢిల్లీ పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఢిల్లీ పోలీసులు ఈ కేసును స్పెషల్ సెల్ కు బదిలీ చేశారు. ఈ సెల్ సభ్యులు పంచ్ ప్రభాకర్ పోస్ట్ చేసిన వీడియోలను పరిశీలించి అతడిపై నిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతటితో ఆగని పోలీసులు యూట్యూబ్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు. పంచ్ ప్రభాకర్ వీడియోలపై పూర్తి సమాచారం అందించాలని యూట్యూబ్ కు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యలకే అరెస్టై దిక్కు దివానం లేకుండా వైసీపీ యాక్టివిస్టులు సతమతమవుతోంటే.. ఇక ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ లపైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్ పరిస్థితి ఏమిటో ఊహకే అందడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ‘మీసాల’ మాధవ్ కు ఇక బ్యాండ్ బాజానే











