‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరిట ఇండియా టుడే మంగళవారం నాడు విడుదల చేసిన సర్వే ఫలితాలు దేశ రాజకీయాల్లో పెను చర్చను రేకెత్తించాయనే చెప్పాలి. పలు రాష్ట్రాల సీఎంల పనితీరు అంతకంతకూ దిగజారిపోతున్న వైనాన్ని బయటపెట్టిన ఆ సర్వే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా కొడిగడుతున్న వైనాన్ని కూడా వెల్లడి చేసేసింది. అంతేకాకుండా ఇటీవలి కాలంలో మునుపటి మాదిరిగా కాకుండా తనదైన శైలిలో సత్తా చాటుతున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మేనియా కూడా అంతకంతకూ పెరుగుతున్న వైనాన్ని చాటి చెప్పింది. మరీ ముఖ్యంగా బీజేపీలో మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ కు దేశవ్యాప్తంగా పెరుగుతున్న మద్దతును కూడా ఈ సర్వే వెల్లడించింది. మొత్తంగా మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తుండగా.. రాహుల్ కు అనుకూల పవనాలు వీస్తున్న వైనాన్ని బట్టబయలు చేసిన ఈ సర్వేపై ఇప్పుడు కొత్త చర్చకు తెర లేసింది.
66 నుంచి 24 శాతానికి డ్రాప్
2014 ఎన్నికల్లో తనదైన శైలి కొత్త ప్రచారంతో బరిలోకి దిగిన నరేంద్ర మోదీ.. అప్పటికే 10 ఏళ్ల పాటు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ను ఈజీగానే కుప్పకూల్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కోలుకోని విధంగా తనదైన మార్కు పాలనతో సాగిన మోదీ.. 2019 ఎన్నికల నాటికి అసలు తనకు సరిజోడి లేకుండానే చూసుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ.. మోదీ వ్యూహాల ముందు నిలవలేకపోయారు. వెరసి 2019 ఎన్నికల్లోనూ మోదీ నేతృత్వంలోని బీజేపీ విక్టరీ కొట్టేసింది. అయితే ఉరుములేని పిడుగు మాదిరిగా వచ్చి పడిన కరోనా వైరస్.. ప్రపంచంలోని అన్ని దేశాల స్థితిగతులను మార్చేసిందనే చెప్పాలి. ఇందుకు భారత్ కూడా మినహాయింపేమీ కాదు. కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిన దేశాన్ని గడ్డున పడేసే చర్యల విషయంలో మోదీ సర్కారు సఫలం కాలేదు. అంతేకాకుండా భారీ ప్యాకేజీలు అంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆత్మనిర్భర ప్యాకేజీ బీజేపీకి కలిసి రాకపోగా.. ఎదురు తన్నింది. ఆ తర్వాత సెకండ్ వేవ్ లో మోదీ సర్కారు మరింతగా విఫలమైపోయింది. వెరసి మోదీ హవా గతేడాదిలో కనిపించిన 66 శాతం నుంచి ఏడాది తిరిగేలోగానే.. 24 శాతానికి పడిపోయింది.
వరుస ఓటములతో రాటుదేలినట్టే
కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన సమయంలో ఎంపీగా కొనసాగిన రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అంతగా సుముఖత వ్యక్తం చేయలేదు. ఏదో అలా ఎంపీగా ఉంటూ.. తన మిత్ర బృందంలోని వారికి మంత్రి పదవులు ఇప్పించుకుంటూ ఎంజాయ్ చేశారనే చెప్పాలి. అయితే 2014లో పార్టీకి ఘోర పరాభవం ఎదురు కావడం ఆయనను బాగానే కలచివేసిందని చెప్పాలి. 2014 తర్వాత ఓ మోస్తరుగా యాక్టివ్ గా కనిపించిన రాహుల్.. 2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే క్షేత్రస్థాయి కూర్పును మాత్రం ఆయన మరిచిపోయారు. అంతేకాకుండా మోదీని ఢీకొట్టే వ్యూహాలను రచించలేకపోయారు. పలితంగా 2019 ఎన్నికల్లో పార్టీ మరోమారు ఓటమి పాలు కాగా.. తన సొంత నియోజకవర్గం అమేథీలో రాహుల్ ఓడిపోయారు. ఏదో కేరళలోని వయనాడ్ లో అలా నిలబడబట్టి సరిపోయింది గానీ.. లేదంటే రాహుల్ ఈ దఫా అసలు పార్లమెంటులోనే అడుగుపెట్టలేని పరిస్థితి. ఈ దయనీయ స్థితి కూడా రాహుల్ ను మరింతగా కలవరపాటుకు గురి చేసిందనే చెప్పాలి. ఈ క్రమంలో తనలోని పొలిటీషియన్ ను నిద్ర లేపినట్టుగా కనిపిస్తున్న రాహుల్.. మోదీ సర్కారు వైఫల్యాలపై తనదైన శైలి పోరు మొదలెట్టేశారు. ఇందులో ఆయన ఫలితాన్ని కూడా రాబట్టారని ఇండియా టుడే సర్వేనే చెబుతోంది. గతంలో 8 శాతం ఉన్న తన ప్రభ ఇప్పుడు 10 శాతానికి పెరిగింది.
మోదీకి కష్టమేనా?
ఇటు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాందీ.. దేశ ప్రధానిగా 10 శాతం మంది మద్దతును కూడగట్టుకుంటే.. మోదీ అనుచరుడిగా పేరున్నయూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ 11 శాతానికి తన బలాన్ని పెంచుకున్నారు. మిగిలిన పార్టీల్లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు వరుసగా 8 శాతం మద్దతుతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరి గురించి అంతగా పట్టించుకోకపోయినా.. వీరి మద్దతు గనుక కాంగ్రెస్ పార్టీకి దఖలు పడితే.. మోదీ కథ కంచికి చేరడం ఖాయమేనని చెప్పాలి. ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతును కూడగట్టే పనిని కాంగ్రెస్ పార్టీ మొదలెట్టేసింది. ఆప్ తో పాటు తృణమూల్ కూడా ఆ జట్టులోనే కలిసే అవకాశాలే ఎక్కువ. మరిన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ తో జట్టు కట్టడం ఖాయమే. ఈ నేపథ్యంలో రాహుల్ మరింత సత్తా చాటాలని.. ఇంతకు మించిన మంచి తరుణం మరోమారు ఆయనకు దక్కుతుందో, లేదోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- 70 ఏళ్ల అప్పు 7 ఏళ్లలోనే మూడింతలు










