ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఇటు రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలోనూ చక్రం తిప్పుతోందా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యతగానే మెలగుతున్న జగన్ పార్టీ.. తన పనులను మెల్లమెల్లగానే చక్కబెట్టుకుంటోందా? అన్న దిశగానూ విశ్లేషణలు సాగుతున్నాయి. ఏదేనీ విషయంపై ముందుగా ఓ వ్యూహాన్ని అమలు చేస్తున్న వైసీపీ.. దానితో పని కాకుంటే ప్లాన్ బీని, అదీ వర్కవుట్ కాకపోతే ప్లాన్ సీ.. ఇలా ఒకే అంశానికి సంబంధించి నాలుగైదు రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుని రంగంలోకి దిగుతోందా? అన్న దిశగా కొత్త చర్చ నడుస్తోంది. ఇందుకు ఉదాహరణగా గురువారం నాడు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు లోక్ సభ సెక్రటేరియట్ నోటీసులు జారీ చేసిన వైనాన్ని చెప్పుకోవాలి.
బీజీపీ అగ్రనేతలతో సత్సంబంధాలు
రఘురామ వైసీపీ టికెట్ పైనే ఎంపీగా గెలిచినప్పటికీ.. ఆయనకు బీజేపీలో అగ్రనాయకులుగా ఉన్న మోదీతో పాటు చాలా మంది కేంద్ర మంత్రులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఎంపీ కాకముందు నుంచే ఆయన బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలే నెరపుతున్నారు. పార్లమెంటు కారిడార్ లో అలా ముందుకు సాగుతున్న మోదీ.. తనకు కనిపించిన రఘురామను పేరుతో పిలిచి మరీ పలకరించిన వైనమే ఇందుకు నిదర్శనం. తాను ఎంపీగా గెలిచిన పార్టీ పేరు లేకుండానే నేరుగానే కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్లను కూడా రఘురామ సాధిస్తున్న తీరు కూడా ఇందుకు మరింత గట్టి ఉదాహరణ అనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలన్న వైసీపీ ఫిర్యాదు ఆధారంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనను నోటీసు జారీ చేయడం, 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేశారంటే.. దీని వెనుక వైసీపీ అనుసరించిన వ్యూహాలే కారణమని చెప్పక తప్పదు.
రఘురామ తప్పేముంది?
వాస్తవానికి రఘురామరాజు వైసీపీపై నిరాధార ఆరోపణలేమీ చేయలేదు. సర్కారీ బడుల్లో తెలుగు మాధ్యమాన్ని తీసేస్తామని జగన్ సర్కారు చెబితే.. మాతృభాషపై మమకారం ఉన్న ఓ తెలుగు వాడిగా, ఎంపీగా రఘురామరాజు లోక్ సభలో ఈ అంశంపై గళం విప్పారు. అప్పటి నుంచే రఘురామకు కష్టాలు మొదలయ్యాయి. అయితే తెలుగు మాధ్యమం ఎత్తివేత తర్వాత జగన్ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమేనని రాష్ట్రంలో కొనసాగుతున్న నిరసనలు చెప్పకనే చెబుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఇవే అంశాలపై రఘురామ వరుసగా తన వైఖరిని స్పష్టం చేస్తూ వచ్చారు. అయితే రఘురామపై కక్ష పెంచుకున్న జగన్ సర్కారు ఏకంగా ఆయనను అరెస్ట్ చేయడం, కస్టడీలోనూ థర్డ్ డిగ్రీని ప్రయోగించడం వంటి చర్యలతో వైసీపీ సర్కారు అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఈ వ్యవహారంపై రఘురామరాజు తనదైన శైలి పోరుతో దేశవ్యాప్తంగా వైసీపీ పరువును బజారుకీడ్చారు. ఈ క్రమంలో ప్లాన్ ఏను పక్కన పెట్టిన వైసీపీ.. ప్లాన్ బీని అమలు చేసి.. బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ రఘురామకు నోటీసులు జారీ అయ్యేలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ నోటీసులకు రఘురామ ఎలాంటి సమాధానం ఇస్తారో? ఆ తదుపరి చర్యలేమిటన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Mjust Read ;- దిమాక్ ఉన్నోడు జగన్ వద్ద ఒక్కడూ లేడు