ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన కేసుల వ్యవహారం నిత్యం చర్చకు వస్తూనే ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందినకాడికి దోచుకున్నారన్న ఆరోపణలపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. జగన్ పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఒకటే కేసు నమోదైనా.. విచారణలో పలు ఇతర కంపెనీలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో సీబీఐ అధికారులు జగన్ పై ఏకంగా 11 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో జగన్ అరెస్టై 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులన్నీ ఆర్థిక వ్యవహారాలతో కూడుకున్న నేపథ్యంలో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా జగన్ పై కేసులు నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగానే ఈడీ ఈ కేసులను నమోదు చేసింది. ఈ కేసులన్నింటికీ సంబంధించి ఇప్పటికే సీబీఐ 11 చార్జిషీట్లను కోర్టుకు సమర్పించగా.. ఇప్పటికే 7 చార్జిషీట్లను ఈడీ దాఖలు చేయగా.. తాజాగా మరో రెండు చార్జిషీట్లను కోర్టుకు సమర్పించింది. మొత్తంగా జగన్ పై కోర్టుల్లో విచారణకు సిద్ధంగా ఉన్న కేసుల సంఖ్య 20కి చేరినట్టుగా చెప్పాలి.
తాజా చార్జిషీట్ల వివరాలివి
జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ వాన్ పిక్ ప్రాజెక్టును చేపట్టారు. గల్ఫ్ లోని ఓ చిన్న దేశం రస్ అల్ ఖైమా తో కలిసి నిమ్మగడ్డ ప్రసాద్ జాయింట్ వెంచర్ గా దీనిని ప్రారంభించారు. దీనికి అప్పటి ప్రభుత్వం 24 వేల ఎకరాలు కేటాయించింది. అయితే ఈ కేటాయింపుల వెనుక క్విడ్ ప్రో కో ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేటాయింపుల తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్.. జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టారని సీబీఐ కేసులు నమోదు చేసింది. దాదాపుగా రూ. 850 కోట్లను.. జగన్ సంస్థల్లో నిమ్మగడ్డ పెట్టుబడులుగా పెట్టారు. వీటిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసుపై ఈడీ తాజాగా చార్జిషీట్ నమోదు చేసింది. అనంతపురం లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం వేల ఎకరాల భూముల్ని వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ఏమీ పనులు చేపట్టకపోగా ఆ భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకున్నారు. అదే సమయంలో భూముల్ని కేటాయించినందుకు గాను క్విడ్ ప్రో కో తరహాలో జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. వీటిపైనా ఈడీ తాజాగా చార్జిషీట్లు దాఖలు చేసింది.
విచారణలే తరువాయి
సీబీఐ నమోదు చేసిన కేసులకు సంబంధించి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్లను సీబీఐ అధికారులు ఎప్పుడో దాఖలు చేసేశారు. ఇక ఇవే కేసులను ఆధారం చేసుకుని తాను నమోదు చేసిన కేసులకు సంబంధించి ఈడీ కూడా తాజా చార్జిషీట్లతో కలిపి మొత్తం 9 చార్జిషీట్లను కోర్టుకు సమర్పించింది. కోర్టుకు చార్జిషీట్లు చేరాయంటే.. ఆయా కేసుల విచారణకు రంగం సిద్ధమైపోయినట్టే కదా. అందుకే కాబోలు ఈడీ కేసుల కంటే ముందుగా సీబీఐ కేసులను విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలంటూ జగన్ కేసుల్లో రెండో నిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవలే ఆయన అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా సీబీఐ కేసుల కంటే ముందు ఈడీ కేసుల విచారణే జరగాలన్న కింది కోర్టు ఆదేశాలు కరెక్టేనని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. మొత్తంగా ఈ ముందుగా ఈడీ కేసుల విచారణ మొదలైపోయినట్టే. ఇదిలా ఉంటే.. సీబీఐ నమోదు చేసిన కేసుల సంఖ్య 11 కదా. వాటిలోని 9 అంశాలపైనే ఇప్పటిదాకా ఈడీ కేసులు నమోదు చేసి చార్జిషీట్లను దాఖలు చేసింది. మిగిలిన రెండు అంశాల్లోనూ ఈడీ కేసులు నమోదు చేయడంతో పాటు విచారణకు రంగం సిద్ధం చేయనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- నారా లోకేశ్ ను చూస్తుంటే జగన్ కు దడే