తెలంగాణలో ఇప్పుడు ఏ రాజకీయ పార్టీని కదిలించినా.. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలు ఏమిటన్న విషయంపై ఆయా పార్టీలు తమదైన శైలిలో పసిగట్టేస్తున్నాయి. తొలుత ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటీ అనుకున్నా.. టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ ఎన్నికతో కాంగ్రెస్ కూడా బరిలోకి దిగేసింది. ఆ తర్వాత గెలిచే సత్తా లేదని తెలిసి కూడా ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి కూడా పోరుకు జైకొట్టింది. ఇక చిన్నా చితక పార్టీలను పక్కనపెడితే.. తెలంగాణలో కొత్తగా బరిలోకి దిగిన వైఎస్సార్టీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదంటే సమయం లేదని బరి నుంచి తప్పుకుంటుందా? అన్న దిశగా నిన్నటిదాకా విశ్లేషణలు సాగాయి. వాటికి తెర దించుతూ ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తేల్చి చెప్పేశారు.
విజయం కూడా సాధిస్తారట
హుజూరాబాద్ లో పోటీ చేయడం లేదన్న మాటను షర్మిల నేరుగా చెప్పలేదు. తనదైన శైలి ఈక్వేషన్లను ప్రస్తావించిన షర్మిల.. అసలు తమ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేయాలంటూ ప్రశ్నించారు. అంతేకాదండోయ్.. తాము ప్రస్తావిస్తున్న డిమాండ్లకు టీఆర్ఎస్ సర్కారు నుంచి సానుకూల ప్రకటన వస్తే తప్పకుండా పోటీ చేస్తామని, ఎన్నికల్లో విజయం సాధించి తీరతామని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలపై తనదైన శైలి వైఖరిని బయటపెట్టిన షర్మిల… హుజూరాబాద్ బైపోల్ పోటీపైనా సూటిగా తన మాటను చెప్పలేదు.
షర్మిల లాజిక్కేమిటంటే..?
హుజూరాబాద్ ఉప బరిలో వైఎస్సార్టీపీ బరిలోకి దిగాలంటే.. రెండు ప్రధానమైన డిమాండ్లను ఆమె ప్రస్తావించారు. ఈ దిశగా షర్మిల ఏమన్నారంటే.. ‘‘రాష్ట్రంలోని 54 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమనండి మేం బరిలోకి దిగుతాం. దళితులకు మూడెకరాల భూములన్నారు. ఇస్తామనండి పోటీ చేస్తాం. పగలు ప్రతీకారాల కోసం వచ్చే ఎన్నికల్లో మేం నిలబడాలా? అర్థమే లేని ఎన్నికలివి’’ అని పేర్కొన్న షర్మిల.. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ మాటను ఆమె నేరుగా చెప్పకుండా లాజికల్ గా రెండు అంశాలను ప్రస్తావించి పోటీ చేయట్లేదని చెప్పడం గమనార్హం.
Must Read ;- రేవంత్ దూకుడు.. టీఆర్ఎస్ కు ముచ్చెమటలు!











