ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఒక వార్త జోరుగా షికారు చేస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయనున్నాడనేది ఆ వార్త సారాంశం. టాలీవుడ్ దర్శకులలో కృష్ణవంశీ స్థానం ప్రత్యేకం. ఆయన ఖాతాలో ఎన్నో విభిన్నమైన సినిమాలు .. విలువైన విజయాలు ఉన్నాయి. అయితే కొంతకాలంగా కృష్ణవంశీకి హిట్ అనేది తెలియదు. అలా అని చెప్పేసి సక్సెస్ లతోనే ఆయన టాలెంటును లెక్కగట్టలేం. కాలం కలిసిరాకపోతే ప్రతిభావంతులు కూడా పరీక్షలను .. పరాజయాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
అలా కృష్ణవంశీ .. కనుచూపుమేరలో కనిపించని విజయాన్ని గురించి చాలాకాలంగా ఎదురు చూస్తున్నాడు. బాలకృష్ణ 100వ సినిమాగా ఆయన ‘రైతు’ అనే సినిమా చేయాలనుకున్నాడు. ఈ కథ బాలకృష్ణకి నచ్చింది .. అయితే అందులో ఒక కీలకమైన పాత్రను అమితాబ్ చేస్తే బాగుంటుందని ఆయన భావించాడు. కానీ ఆయన ఒప్పుకోకపోవడంతో బాలకృష్ణ కూడా తప్పుకున్నారు. అప్పటి నుంచి కృష్ణవంశీ దగ్గర ‘రైతు’ కథ అలాగే ఉంది. ఆ కథను ఆయన చిరంజీవితో చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో వ్యవసాయ సంబంధమైన రైతుల సమస్యల చుట్టూ ఈ కథ నడవనుంది.
చిరంజీవి రాజకీయాలలోకి వెళ్లకముందే ఆయనతో ఒక సినిమా చేయాలని కృష్ణవంశీ భావించాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రయత్నాలు ఆదిలోనే ఆగిపోయాయి. నిజానికి మెగా ఫ్యామిలీతో కృష్ణవంశీకి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ‘రైతు’ సినిమాలో కంటెంట్ డిఫరెంట్ గా ఉంటే ఆయన మెగాస్టార్ ను ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ‘ఖైదీ నెంబర్ 150‘ సినిమాలోనే వ్యవసాయదారుల సమస్యలను టచ్ చేసిన చిరంజీవి, మళ్లీ అదే పాయింట్ చుట్టూ తిరిగే కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేదే చూడాలి. ప్రస్తుతం కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమాతో బిజీగా ఉన్నాడనే విషయం తెలిసిందే.
Must Read ;- మెగాస్టార్ సరసన ఛాన్స్ దక్కించుకునేది ఎవరు?