దర్శకుడు మారుతి.. హీరో గోపీచంద్ తో తెరకెక్కిస్తోన్న పక్కా కమర్షియల్ మూవీకి లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ టైమ్ లో మారుతి ఓటీటీ కోసం కథ రెడీ చేయడం జరిగిందే. ఆ కథతో ఏక్ మినీ కథ ఫేమ్ సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తుంది. నెల రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ప్లాన్ తో షూటింగ్ స్టార్ట్ చేశారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమా గురించి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు మారుతి మతిమరుపు కాన్సెప్ట్ తో భలే భలే మగాడివోయ్ సినిమా తీశారు. ఆతర్వాత అతి శుభ్రత కాన్సెప్ట్ తో మహానుభావుడు సినిమా తీశారు. అతి మంచితనం కాన్సెప్ట్ తో బాబు బంగారం, అతి ఇగో కాన్సెప్ట్ తో శైలజరెడ్డి అల్లుడు సినిమాలు తెరకెక్కించారు. అయితే.. ఈసారి మారుతి అతి భయం అనే కాన్సెప్ట్ ను తీసుకున్నారని తెలిసింది. సొసైటీలో నేరాలు పెరుగుతున్నాయి. వైరస్ లు పెరుగుతున్నాయి. దీంతో బతుకులు భయం భయంగా మారిపోతున్నాయి.
అందుచేత.. ప్రతి చిన్నదానికి భయపడే ఓ పెద్దాయిన కథతో మారుతి సినిమా చేస్తున్నారు. దీనికి మంచి రోజులు వచ్చాయి అనే టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. అతిగా భయపడే పెద్దాయిన పాత్రలో అజయ్ ఘోష్ నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై ఫస్ట్ వీక్ కు రెడీ చేయాలనేది ప్లాన్. అయితే.. ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేస్తారా..? లేదా థియేటర్లో రిలీజ్ చేస్తారా..? అనేది తెలియాల్పివుంది.
Must Read ;- ‘ప్రేమ్ కుమార్’ గా ‘ఏక్ మినీ కథ’ హీరో