సమాజంలోని సంఘటనలే ఇతివృత్తాలుగా సినిమాలు చేస్తుంటారు దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం `వలస’. కోవిడ్ కారణంగా లాక్ డౌన్ పెట్టిన సమయంలో లక్షలాది వలస కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. గత్యంతరం లేక రోడ్డున పడ్డ వారి జీవితాల నేపధ్యాన్ని కథావస్తువుగా చేసుకుని ఆయన ఈ చిత్రాన్ని మలిచారు. మనోజ్ నందం, తేజు అనుపోజు, వినయ్ మహాదేవ్ , గౌరీ, చిన్నారి, తులసి రామ్, మనీషా, తనీషా, ఎఫ్ ఏం బాబాయ్, సముద్రం వెంకటేష్, మల్లికా, నల్ల శీను, రమణి, ప్రణవ్, సాజిద్ తదితరులు ఈ చిత్రంలో వలస కార్మికులుగా నటించగా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో సన్నీ, పోలీస్ పాత్రలో వాసు. జర్నలిస్ట్ గా రామన్, కనిపిస్తారు.
కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మాణ సారథ్యంలో నిర్మించబడ్డ ఈ చిత్రం సెన్సార్ సైతం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 18న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత యెక్కలి రవీంద్ర బాబు తెలిపారు. ఇంకా ఆయన చిత్ర విశేషాలను వెల్లడిస్తూ, లాక్ డౌన్ టైమ్ లోనే విశాఖ జిల్లా పరిసరప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ చేశాం,.ఎంతోమంది జీవితాలను అధ్యనం చేసి వాటి ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాం. ఎన్నో యదార్ధ పాత్రలను కూడా తెరపై ఆవిష్కరించాం. వలస కార్మికుల వందల కిలోమీటర్ల ప్రయాణం గురించే కాకుండా వారి జీవితాల్లోని ప్రేమను, ఆనందాన్ని కూడా ఇందులో ఎంతో హృద్యంగా చూపించాం అని అన్నారు.
దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, `నగరాలను నిర్మించిన వలస కార్మికులు పరిస్థితుల కారణంగా అనాధలుగా మారడం, వాళ్ళు వేసిన రోడ్లే వారిని తమ ఊర్లకు తీసుకుని వెళ్లడం, వారి కష్టాన్నికూడా పబ్లిసిటీకి ఉపయోగించుకునే పైశాచికత్వం కూడా ఈ చిత్రంలోని పాత్రలలో చూపాం. కళ్ళ ముందు జరిగిన జీవితాన్ని తెరపై చూపడానికి చేసిన ఓ మంచి ప్రయత్నమే ఈ చిత్రం. మనసుకి హత్తుకొనే పాటకి మనోహర్ సాహిత్యం అందించారు’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ,,ఎడిటింగ్ : నరేష్ కుమార్ మడికి, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బి బాపిరాజు, సహ నిర్మాత: శరత్ ఆదిరెడ్డి, రాజా జి , నిర్మాత: యక్కలి రవీంద్ర బాబు, రచన, దర్శకత్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి.
Must Read ;- ’తిలోత్తమ పాత్రను జనం మరిచిపోలేదు.. !