ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు వాడీవేడిగా జరిగాయి. ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. గెలుస్తామా? ఓడిపోతామా? అనే టెన్షన్‌లో వివిధ రాజకీయ పార్టీల నేతలున్నారు. పోనీ ఎగ్జిట్ ఫలితాలు వచ్చినా ఆ ఫలితాలను బట్టి తమ గెలుపోటములను బేరీజు వేసుకుందామన్నా గానీ ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఫలితాలపై ఎన్నికల అభ్యర్థుల ముఖాల్లో ఆందోళన కనబడుతోంది.
ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో పార్టీ గుర్తులు తారు మారు కావడంతో అక్కడ ఈ రోజు రీపోలింగ్ జరుగుతోంది. సీపీఐ పార్టీ గుర్తు అయిన కంకికొడవలికి బదులు సీపీఎం గుర్తు అయిన సుత్తి కొడవలిని బ్యాలెట్ పేపర్‌లో ముద్రించారు. దీనిపై ఎన్నికల సంఘానికి సీపీఐ నేతలు కొందరు ఫిర్యాదు చేయడంతో అక్కడ రీపోలింగ్ అనివార్యమైంది. ఈ రోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ ఆ డివిజన్‌లో ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
అయితే ఓల్డ్ మలక్‌పేట్‌లో రీపోలింగ్ సమయం ముగిసిన తరువాతే అంటే సాయంత్రం 6 గంటల తరువాతే ఎగ్జిట్ పోల్స్ వెలువడే అవకాశం ఉంది. అప్పటి దాకా ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే. సాధారణంగా ఏ ఎన్నికలు జరిగినా కూడా కొన్ని సంస్థలు తమకున్న సమాచారం.. లెక్కల ప్రకారం ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తాయి. ఏ పార్టీ అధికారం కైవసం చేసుకోబోతున్నట్లు ముందస్తుగానే వారికున్న సమాచారం ప్రకారం అంచనా వేస్తుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఎంత ఓటింగ్ పర్సంటేజీ నమోదైంది? అనే అంచనాలను ప్రకటిస్తాయి. ఒక్కోసారి ఈ అంచనాలకు దగ్గరగానే గెలుపోటములు ఉంటాయి.
ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం 6 గంటల తరువాత కొన్ని సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించే అవకాశముంది. ఈ ఫలితాలకు ఎంతో కొంత క్రెడిబులిటీ ఉందని నమ్మే నేతలు ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. అందులో వచ్చే ఫలితాలను బట్టి తమ గెలుపోటములను బేరీజు వేసుకుని కాస్త టెన్షన్ తగ్గించుకుందామనే ఆలోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతో ఆతృతగా, ఆసక్తిగా ఎగ్జిట్ పోల్స్ వెలువరించే ఫలితాల కోసం పార్టీ అభ్యర్థలు ఎదురు చూస్తున్నారట. సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి రిజల్ట్స్‌ను చెబుతాయో చూడాలి మరి.
Must Read ;- పోలింగ్‌లో షాకిచ్చిన యువత.. మునిగామనుకుంటున్న పార్టీలు











