( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
దేశ చరిత్రలో ఏకతాటిపై కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఒకేసారి ఈ నెల 26న సమ్మెకు పిలుపునిచ్చారు. హక్కుల కోసం పోరాటం… డిమాండ్ల సాధన కోసం నిరసనలు దేశంలో కొత్తేమీ కాదు. వాటిని కొన్ని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకుంటే, మరి కొన్ని ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తాయి. ప్రస్తుతం నిర్వహించ తలపెట్టిన సమ్మె జీతాల కోసమో, సెలవుల కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో నిరసన గళం విప్పుతున్నది కాదు.
మూడు నల్ల చట్టాలు
దేశ ఆర్ధిక వ్యవస్థ పతనం అయిపోవడానికి, జిడిపి మైనస్‌లోకి పడిపోవడానికి, ధరల పెరుగుదలకు, కరోనాలో వలస కార్మికులు అన్యాయంగా బలైపోవడానికి, అనేకమంది ఉద్యోగాలు ఊడిపోవడానికి కారణమైన మూలాల కోసం. గిట్టుబాటు ధర కోసం చట్టం చేయమంటే, మొత్తం వ్యవసాయాన్ని కార్పోరేట్ కంపెనీలకు అప్పగించే మూడు నల్ల చట్టాలు చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం. రైతాంగాన్ని శాశ్వతంగా దివాలా తీయించే ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఈ పోరాటంలో భాగస్వాములు కానున్నారు.
బలవంతంగా విఆర్‌ఎస్
నిరుద్యోగ సమస్య పరిష్కరించాల్సిన ప్రభుత్వం BSNL, SBI, తపాలా, స్టీల్ ప్లాంట్, రైల్వేలో బలవంతంగా విఆర్‌ఎస్ ఇచ్చి ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిస్తోంది. లాభాల్లో ఉన్న ఎల్ఐసి, రైల్వే, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బిహెచ్‌పి వి వంటి సంస్థలను క్రమంగా ప్రైవేటు పరం చేస్తోంది. దానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన బాటను ఎంచుకున్నారు.
సొంత కాళ్లపైనా బతకనివ్వరు..
ఉద్యోగ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు విఫలం కాగా, స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న మోటారు వాహన కార్మికులపైన కనీస కనికరం చూపడం లేదు. “మోటారు వాహనాల సవరణ బిల్లు” పేరిట భారీగా చలాన్‌లు విధించి వారి శ్రమను దోచుకునేందుకు చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగానే ఆయా వర్గాల పోరాటం.
కనీస వేతనం రూ.18000/- ఇవ్వాలనీ, పట్టణ ఉపాధి హామీ చట్టం అమలు చేయాలని, గ్రామీణ ఉపాధి పనులు కనీసం 200 రోజులు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలని, నల్ల చట్టాలు.., బ్రిటిష్ కార్మిక చట్టాలు రద్దు చేయాలని, కరోనాలో పనిపోయిన వారికి రూ.7, 500/- ఇవ్వాలని, ప్రభుత్వ సంస్థలు అమ్మొద్దని, మోటారు వాహనాల సవరణ చట్టం అమలు చేయొద్దని, చమురు ధరలు తగ్గించాలని, ఆర్టీసీలను బలోపేతం చేయాలని, కార్మిక చట్టాల్లో మార్పును వ్యతిరేకిస్తూ, రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయాలనీ, ‘మత ఘర్షణ వద్దు – శాంతి కావాలని’ జరుగుతున్న ఈ పోరాటంలో ఎంత మంది చేయి చేయి కలుపుతారో వేచి చూడాల్సిందే.
Must Read ;- 700 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. ఎక్కడో తెలుసా..?











