అధికారులన్నాక బదిలీలు తప్పవు. ప్రమోషన్లు, డిమోషన్లు కూడా కామనే. అందులోనూ సివిల్ సర్వీసెస్ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ లు ఏళ్ల తరబడి ఒకే పోస్టింగ్ లో కొనసాగడం కూడా సాధ్యం కాదు. తాజాగా బుధవారం సైబరాబాద్ కమిషనర్ గా కొనసాగుతున్న ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ముద్రపడిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జన్నార్ ను కేసీఆర్ సర్కారు ఆ పదవి నుంచి బదిలీ చేసింది. తెలంగాణ ఆర్టీసీ వీసీ అండ్ ఎండీగా నియమించింది. ఇక సజ్జన్నార్ బదిలీతో ఖాళీ అయిన సైబరాబాద్ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. స్టీఫెన్ అంశాన్ని పక్కనపెడితే.. సజ్జన్నార్ ను ఆర్టీసీ ఎండీగా పంపుతూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. ఆయనకు ప్రమోషన్ ఇచ్చినట్టా, లేదంటే డిమోట్ చేసినట్టా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
అప్పుడు వరంగల్.. ఇప్పుడు సైబరాబాద్
2008లో సజ్జన్నార్ వరంగల్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో ఓ కళాశాల విద్యార్థినిపై ముగ్గురు యువకులు యాసిడ్ దాడి చేశారు. ఈ దాడిపై వేగంగా రియాక్ట్ అయిన సజ్జన్నార్.. నిందితులను అరెస్ట్ చేశారు. అయితే వారిని పోలీస్ స్టేషన్ కు తరలించేలోగానే వారు పారిపోయేందుకు యత్నించారని, ఈ క్రమంలో వారిని షూట్ చేయాల్సి వచ్చిందని సజ్జన్నార్ సంచలన ప్రకటన చేశారు. అంటే.. విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసిన వారిని పోలీసులు ఎన్ కౌంటర్ లో లేపేశారన్న మాట. ఈ ఘటన నాడు దేశవ్యాప్తంగా పెను కలకలం రేపింది. ప్రజా సంఘాలు సజ్జన్నార్ తీరుకు నిరసన తెలిపాయి. అయినా కూడా సజ్జన్నార్ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా 2019లో తాను కమిషనర్ గా ఉన్న సైబరాబాద్ పరిధిలో శంషాబాద్ పరిసరాల్లో దిశ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసుపైనా తనదైన స్పీడుతో రియాక్ట్ అయిన సజ్జన్నార్.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరిట వారిని ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లిన సజ్జన్నార్ బృందం నలుగురినీ ఎన్ కౌంటర్ చేసింది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కు తీసుకెళితే.. నిందితులు పారిపోయే యత్నం చేశారని, అందుకే వారిని కాల్చేశామని సజ్జన్నార్ చెప్పారు. ఈ ఘటనపైనా దేశవ్యాప్తంగా ప్రశంసలు, విమర్శలు రేకెత్తాయి. అయితే సజ్జన్నార్ వీటినీ పట్టించుకోలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా సైబరాబాద్ కమిషనర్ గా సజ్జన్నార్ ఏకంగా రెండేళ్లకు పైబడే పనిచేశారు. తాజాగా అక్కడి నుంచి బదిలీ అయ్యారు.
నాన్ పోలీస్ డ్యూటీ
ఐపీఎస్ సర్వీస్ లో చేరిన నాటి నుంచి లా అండ్ ఆర్డర్ విభాగంలోనే పని చేస్తూ వచ్చిన సజ్జన్నార్ తొలిసారిగా ఐపీఎస్ అధికారి అయి ఉండి కూడా నాన్ పోలీస్ విధులకు వెళ్లిపోతున్నారు. ఆర్టీసీ ఎండీ పోస్టుకు ఆది నుంచి ఐపీఎస్ అధికారులనే నియమిస్తున్నా.. అది నాన్ పోలీస్ డ్యూటీ కిందే లెక్క. మరి ఇప్పుడు పోలీసు అధికారిగా విధి నిర్వహణలో చాలా అరుదుగా దక్కే ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గుర్తింపు దక్కించుకున్న సజ్జన్నార్ ఎలా రాణిస్తారన్నదే కీలకంగా మారింది. అసలు ఆ పదవిలో ఆయన సంతృప్తిగా పనిచేయగలరా? అన్న వాదనలూ వినిపిస్తున్నాయి. దిశ ఎన్ కౌంటర్ నాడు పలు సంఘాలు సజ్జన్నార్ ను లూప్ లైన్ లోకి మార్చాలంటూ డిమాండ్ చేశాయి. ఆ డిమాండ్లను నాడు కేసీఆర్ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు సజ్జన్నార్ ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసిన కేసీఆర్ సర్కారు.. ఆయనకు ప్రమోషన్ ఇచ్చినట్టా.. లేదంటే డిమోట్ చేసినట్టా అన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- జగన్ ఆఫర్ ను ఈ టాప్ కాప్ రిజెక్ట్ చేశారా?











