నిజమే.. వ్యాపారంలో పీవీ కృష్ణారెడ్డి.. అదేనండీ మేఘా కృష్ణారెడ్డి వ్యాపార రంగంలో టైకూనేనని చెప్పాలి. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగుతున్న కృష్ణారెడ్డి.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మాణ రంగం నుంచి పలు రంగాలకు విస్తరించేశారు. తెలుగు నేలలో ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డిని ఢీకొట్టే స్థాయి కలిగిన వ్యాపారవేత్త లేరంటే అతిశయోక్తి కాదేమో. అటు తెలంగాణలో కీలక ప్రాజెక్టుల పనులను దక్కించుకున్న మేఘా కృష్ణారెడ్డి.. ఇటు ఏపీలోనూ కీలక కాంట్రాక్టులను దక్కించుకుంటున్నారు. ఇక దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కృష్ణారెడ్డి కీలక ప్రాజెక్టులను దక్కించుకున్నారు. దినదినాభివృద్ధి సాధిస్తున్న కృష్ణారెడ్డి.. ఇటీవలే ఫోర్బ్స్ ధనికుల జాబితాలో చోటు సంపాదించారు కూడా. ఇలావ్యాపారంలో క్షణం కూడా తీరికలేని రీతిలో కృష్ణారెడ్డి సాగుతుంటే.. ఆయన సతీమణి సుధా రెడ్డి తళుకు బెళుకుల రంగం ఫ్యాషన్ లో సత్తా చాటుతున్నారు.
భారత్ నుంచి ఒకే ఒక్కరు
ఏటా అమెరికాలో మెట్ గాలా పేరిట భారీ ఎత్తున ఫ్యాషన్ షో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాలుపంచునేందుకు బాలీవుడ్ కు చెందిన పలువురు హీరోయిన్లు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటిదాకా బిజినెస్ రంగానికి చెందిన వారెవ్వరూ ఈ షోలో కనిపించలేదనే చెప్పాలి. అయితే ఈ ఏడాది జరిగిన మెట్ గాల-2021 లో సుధారెడ్డి తళుక్కున మెరిశారు. పలు దేశాలకు చెందిన ఫ్యాషన్ స్టార్లు పాల్గొన్న ఈ షోలో భారత్ నుంచి ఒకే ఒక్కరు హాజరు కాగా.. ఆ ఒక్కరు సుధారెడ్డే కావడం గమనార్హం. అమెరికా బిజినెస్ కేపిటల్ న్యూయార్క్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్ లో తనదైన మార్కు గౌన్ తో ఎంట్రీ ఇచ్చిన సుధారెడ్డి అందరినీ ఆకట్టుకున్నారు. సుధారెడ్డి కంటే ఆమె ధరించిన గౌన్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ఫల్గుణి, షేన్ పీకాక్.. ఏకంగా 250 గంటల పాటు కష్టపడి ఈ గౌన్ ను తీర్చిదిద్దారట. అమెరికా ఇండిపెండెన్స్ థీమ్ తో సాగిన ఈ షోలో.. ఆ థీమ్ కు అద్దం పట్టేలా సుధారెడ్డి ఈ గౌన్ ను ధరించారట.
Must Read ;- ఎందులోనైనా!.. ఇండియన్ల తర్వాతే అమెరికన్లు!











