ఓ పెద్ద సినిమా విడుదల కాబోతుందని తెలిస్తే దాని ఇన్ సైడ్ టాక్ ఎలా ఉందన్న క్యూరియా సిటీ అందరిలోనూ ఉంటుంది. ఇలాంటి టాక్ కోసం చిత్ర యూనిట్ సభ్యుల్ని, సెన్సార్ బోర్డు సభ్యుల్ని అడుగుతుంటారు కూడా.
ఇదివరకు సినిమాల లీకేజీలు ఉండేవి. కానీ ఇప్పుడు సెట్స్ కు వెళ్లే ముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కనీసం సెల్ ఫోన్లను కూడా సెట్ లోకి అనుమతించడం లేదు. ఈ విషయంలో రాజమౌళి అయితే ఇంకాస్త జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటుంటారు. షూటింగ్ దశలో దర్శకత్వ శాఖకు తప్ప ఎవరికీ ఏమీ అర్థం కాదు కూడా. సినిమాకి ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం సినిమా ఎలా వచ్చిందన్నది తెలిసిపోతుంది. ఆ తర్వాత సెన్సార్ టాక్ వస్తుంది. ఈ టాక్ కోసం గతంలో బయ్యర్లు కొంత డబ్బు ఎవరికైనా చెల్లించి అయినా తెలుసుకునే ప్రయత్నం చేసేవారు.
సినిమాలో దమ్ము లేదనుకుంటే అడ్వాన్సులు కూడా వదిలేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టీ ట్రిపుల్ ఆర్ చిత్రం మీదే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించారు. జనవరి 7న ఈ సినిమా విడుదల కాబోతోంది. అందరూ ఈ సినిమా ఇన్ సైడ్ టాక్ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా చూడకపోయినా చూసేసినట్టు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టే కుహానా జర్నలిస్టులు కూడా ఈ మధ్య తయారయ్యారు. సినిమాకి ముందే రివ్యూ వచ్చేసిందంటే ఎవరికైనా ఆసక్తి సహజం. దీన్ని క్యాష్ చేసుకునే బాపతు వ్యక్తులు తయారయ్యారు.
సినిమా ఎలా వచ్చింది?
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు 6వేల స్క్రీన్ లలో విడుదల కాబోతోందని చెబుతున్నారు. ఒక్క అమెరికాలోనే 999 థియేటర్లలో ఈసినిమా విడుదలవుతోంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది నూటికి నూరు శాతం యాక్షన్ ప్యాక్డ్ మూవీ. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ నభూతో నభవిష్యతి అంటున్నారు. ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ దాదాపు 16 నిమిషాల సేపు కొనసాగుతుందట. పూర్తిగా కొత్త తరహాలో దీన్ని రూపొందించారట. ఇది కొమరం భీమ్ పాత్రను పోషించిన ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రధారి రామ్ చరణ్ ల మీదనే ఉంటుంది.
వీరిద్దరూ ఒకరి మీద ఒకరు తలపడతారా? వేరొకరిని ఢీకొంటారా అన్నదే ఇందులోని ఆసక్తికర అంశం. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుందట. ఇక ఈ సినిమాలో టైగర్ ఫైట్ మీద బాగా హైప్ ఉంది. ఇది ఎన్టీఆర్ మీద సినిమా ప్రారంభంలోనే వస్తుందని తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుందట. అది కూడా యాక్షన్ బ్లాక్ తోనే ఉంటుందని సమాచారం. ప్రారంభంలోనే పోలీస్ వేషధారణలో రామ్ చరణ్ కనిపిస్తాడు. ఈ ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్ సన్నివేశాలు ఒక మెగా ట్రీట్ గానే భావించాలి. దర్శక ధీరుడు రాజమౌళి వీటిని చక్కగా చెక్కారని సమాచారం.
అలాగే క్లైమాక్స్ లో షాకింగ్ సన్నివేశాలు ఉంటాయి. ఈ ట్విస్ట్ ఏమిటనేదాని మీద కూడా ఆసక్తి ఉంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఓ నెగిటివ్ అంశం కూడా ఉందని చెబుతున్నారు. అది సినిమా నిడివి. దాదాపు 186 నమిషాల రన్ టైమ్ ఉంటుంది. అంటే మూడు గంటల పైమాటే. ఇంతసేపు ప్రేక్షకుడిని కట్టి పడేయడం అంత సులువు కాదు. నిడివి సమస్య కాకపోతే మాత్రం ఓ అద్భుతమైన యాక్షన్ డ్రామాగా మాత్రం ఈ సినిమా నిలిచిపోతుంది. ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు కావలసిన అంశాలన్నీ ఈ ట్రిపుల్ ఆర్ లో ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. సినిమా పాన్ ఇండియా కాబట్టి ఆ స్పాన్ తప్పదనే అనుకోవాలి.











