కొన్ని సర్దుబాట్లు.. కొన్ని గొడవలు.. కొన్ని అలకలు.. ఇలా అన్నీ కలగలిసినదే సంసారం. ప్రస్తుత కాలంలో ఇద్దరూ ఉద్యోగాలపేరుతో బిజిబిజీగా రోజును వెల్లదీస్తున్నారు. పొద్దున బయట అడుగుపెడితే.. తిరిగి ఇద్దరూ ముఖాలు చూసుకునేది రాత్రికే అన్నట్లు ఉంటున్నాయి జీవితాలు. ఒక వేళ ఒక్కరే ఉద్యోగం చేసే వారైనా కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదు. ఇక రాత్రి వంట చేసుకుని తినేంత వరకు తీరక ఉండదు. ఇక ఇరువురు హాయిగా మాట్లాడుకోవడానికి దొరికే సమయం రాత్రి ఒకటే. మరి అలాంటి సమయంలో దంపతులు కొన్ని చిట్కాలు పాటిస్తే వాళ్ల మధ్య దూరమనే వెలితి ఉండదని సలహా ఇస్తున్నారు నిపుణులు. మరి ఆ చిట్కాలేమిటో తెలుసుకుందాం రండి..
ఆఫీసు సమస్యలు ఇంట్లో వద్దు
కొందరు ఆఫీసులో ఎదురువుతున్న సమస్యలను ఇంటి దాకా తెస్తుంటారు. అత్త మీద దుత్త మీద అన్నట్లు.. ఇంట్లో వారిపైన అరుస్తుంటారు. అలాంటి పనులు అస్సలంటే అస్సలు చేయకండి. అది ఎవరైనా సరే.. భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు. కార్యలయంలోని సమస్యలను అక్కడే వదిలేయండి. ఇంటికి ప్రశాంతమైన మనసుతో రండి. ఇంట్లో వాళ్లని నవ్వుతూ పలకరించండి.
Must Read ;- ఈ ఆహారంతో ‘రోగనిరోధక శక్తి’ని పెంచుకోండిలా..

ఆన్ లైన్ బంద్..
ఇప్పుడు అందరూ దాదాపు ఆన్ లైన్ లోనే వర్క్ చేస్తున్నారు. ఇంటికి వచ్చాక కూడా ఫోన్ లేదా సిస్టమ్ లేదా టీవీ చూస్తూ కూర్చోకండి. కాసేపు రిలాక్స్ అవడం సహజం. ఆ తర్వాత మీ భాగస్వామికి సహాయం చేయడంలో నిమగ్నమవ్వండి లేదా వారితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పండి. దీని వల్ల మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు. అంతేకాదు.. మీ భాగస్వామితో మీ అనుబంధం కూడా పెరుగుతుంది. ఇలాంటి పనుల వల్ల హాయిగా నిద్ర కూడా పడుతుంది.
సమయాన్ని నిర్ధేశించుకోండి..
ప్రతిరోజు సమయానికి తినడమే కాదు.. సమయానికి పడుకోవడం కూడా అవసరమే. ఇద్దరి లేదా మీ భాగస్వామి కార్యలయ సమయాన్ని అనుసరించి మీరు ఇరువురు రోజూ ఏ సమయానికి పడుకోవాలి అనే దాన్ని నిర్ణియించుకోండి. దాన్ని తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. హాయిగా నిద్రించడం వల్ల పొద్దున చాలా హుషారుగా రోజును ప్రారంభించవచ్చు.
Also Read ;- పొట్ట తగ్గాలా? అయితే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి!

నిద్రించే ముందు వాదనలు వద్దు
ఎలాంటి సమస్యలైనా కావచ్చు. ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చిన వారితో వాదనలకు దిగడం మంచిది కాదు. ఎలాంటి సమస్యలైనా సరే రాత్రి సమయంలో ఇద్దరూ వాదించుకోవడం మంచిది కాదు. ఆ ప్రభావం మీ నిద్రపైన పడుతుంది. అంతేకాదు.. మీ మధ్య బంధాన్ని బీటలు వార్చుతాయి ఇలాంటి వాదనలు. ఒకవేళ తప్పనిసరిగా మాట్లాడాలి అనే విషయమైతే నెమ్మదిగా చెప్పండి. దానిపై వారు కోప్పడే సూచనలు ఉంటే దాని గురించి మాట్లడకుండా విషయాన్ని పక్కకు తప్పించి వాతావరణాన్ని తేలిక చేయండి.
మాట్లాడుకోవడం తప్పనిసరి
ఇద్దరి మధ్య వాదనలు లేకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో.. ఇద్దరూ మనసారా మాట్లాడుకోవడం కూడా అంతే ముఖ్యం. రోజూ ఏం మాటలుంటాయి అనుకునే వారు. ఒక రోజు ఇంటి విషయాలను పంచుకోవడం, మరొక రోజు ఇద్దరూ కలిసి ఏదైనా ప్రోగ్రామ్ లాంటి దాన్ని కలిసి చూడడం.. ఇలా ఉండేలా ప్లాన్ చేసుకోండి. అది ఇద్దరి మధ్య సాన్నిత్యాన్ని పెంచడంతోపాటు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపకరిస్తుంది.
దాంపత్యం హాయిగా సాగాలంటే ఖరీదైన బహుమతులు.. రోజంతా కలిసుండడం లాంటివి అవసరం లేదు. కలిసుండే సమయాన్ని సద్వనియోగం చేసుకుంటే చాలు.. రోజంతా పడిన అలసటని భాగస్వామితో నవ్వుతూ కాసేపు మాట్లాడితే మరిచిపోవడం ఎంతసేపు. ఇలాంటి చిన్న పనులే మీ బంధానికి మరింత బలాన్ని చేకూర్చుతాయని మరవకండి.
Also Read ;- ఈ ఆహారంతో ప్రణాళిక లేని గర్భధారణకు చెక్ పెట్టవచ్చు











