ఓ వైపు ప్రపంచాన్ని అతలాకుతం చేసిన కొవిడ్ ప్రభావం నుంచి బయటపడలేదు..తాజాగా బర్డ్ ఫ్లూ భయం మొదలైంది. నిన్న మొన్నటివరకు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనే ప్రభావం చూపిన బర్డ్ ఫ్లూ.. హెచ్5ఎన్1,5 రకం ఫ్లూ..ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ, మధ్యప్రదేశ్‌లో భారీగానే ఈ ఫ్లూ ప్రభావం చూపుతోంది. కేరళ ఇప్పటికే ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సూచనలు జారీ చేసింది.మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో 15 రోజుల పాటు చికెన్ సెంటర్లను మూసివేయాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. తొలుత రాజస్థాన్ లో బాతుల్లో దీన్ని గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లో కాకులు, నెమళ్లు, కోళ్లలో ఇది కనిపించింది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ పాంగ్ డామ్ సరస్సు దగ్గర 1800 పక్షులు చనిపోయినట్లు గుర్తించారు. ఇవి వారం కిందట మృత్యవాత పడగా.. హెచ్1ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లెయెంజా వైరస్ వల్లే చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అటు కర్ణాటక కూడా తాము హైఅలర్ట్‌లో ఉన్నట్లు ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో..
తాజాగా తెలుగురాష్ట్రాల్లో కలకలం మొదలైంది. గుంటూరు జిల్లాలో కొన్ని పక్షులు చనిపోగా..గురువారం వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెందిన రైతు గద్ద సారయ్యకు చెందిన 120 కోళ్లు మృతి చెందాయి. అయితే, వీటికి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ మాలతి వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో వారం రోజుల నుంచి 300 నాటు, బ్రాయిలర్ కోళ్లు మృత్యువాత పడడంతో వాటిని శ్రీరాంసాగర్ డీ-86 కెనాల్‌లో పడేయడం సంచలనం రేపింది.
చికెన్‌పై ప్రభావం..
బర్డ్ ఫ్లూ వ్యాధి పక్షులపై తీవ్ర ప్రభావం చూపతుంది. గబ్బిలాలు తప్ప..ఏ పక్షులకైనా సోకుతుంది. ఈ వైరస్ పేరు బయటకు రాగానే..తొలుత పౌల్ట్రీ రంగంపై ప్రభావం చూపుతుంది. ప్రజలు చికన్, గుడ్లు తినడం మానివేయడం శ్రేయస్కరం అనే అభిప్రాయానికి రావడమే ఇందుకు కారణం. అయితే కొన్ని జాగ్రతలు తీసుకుంటే.. చికెన్ , గుడ్లు తినవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. హాఫ్ బాయిల్డ్ తప్ప.. పూర్తిగా ఉడికించి తినవచ్చని చెబుతున్నారు. ఈ వైరస్ గరిష్టంగా 30 నిమిషాల పాటు 70డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతవరకు బతికి ఉంటుంది. కాని మనం సాధారణంగాగుడ్లు, చికెన్ ఉడికించేటప్పడు 160 సెంట్రీగ్రేడ్ ఉష్ణోగ్రత జనరేట్ అవుతుంది. కాబట్టి వైరస్ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. కాని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చికెన్‌ని తాకినప్పుడు (చికెన్ క్లీనింగ్, లేదా కోళ్లను కోయడం, కోళ్లను పట్టుకోవడం) అదే చేతులతో ఇతర శరీర భాగాలు, వస్తువులు తాకకుండా చూసుకోవడం, వెంటనే శుభ్రం చేసుకోవడం, స్నానం చేయడం, పాత్రల క్లీనింగ్ పాటించాలని మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ ఉత్పత్తులపై ఇప్పటికే ఈ ప్రభావం పడింది. మొన్నటి వరకు కిలో రూ.250 కి అటూఇటూగా ఉన్న చికెన్ ధర ఇప్పుడు రూ.180కి దిగువకు వచ్చిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎయిమ్స్, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, రాష్ట్ర ఆరోగ్యశాఖల మార్గదర్శకాల ప్రకారం.. పౌల్ట్రీ ఉత్పత్తులను ఎప్పటిలాగే వండుకొని, తినవచ్చని చెబుతున్నారు. తెల్ల, పచ్చ సొనలు పూర్తిగా ఉడికి గట్టిపడే వరకూ గుడ్లను ఉడికించాలి.
Must Read ;- బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తం అవుతున్న ప్రభుత్వాలు

అసలు బర్డ్ ఫ్లూ ఏంటంటే..
పలు రాష్ట్రాల్లో చనిపోయిన పక్షుల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ కనిపించింది. చనిపోయిన పక్షుల నమూనాలను ICAR (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీసెస్) భోపాల్‌లో పరీక్షించగా.. హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా బయటపడింది. 2015 నుంచి ప్రతి శీతాకాలంలో బర్డ్ ఫ్లూ కేసులు దేశంలో నమోదవుతూనే ఉన్నాయి. ఇది కేవలం కోళ్లకే కాదు.. పెంపుడు జంతువులకూ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇతర రాష్రాల్లో హెచ్5ఎన్1 బయటపడగా కేరళలో అదే ఫ్లూ గ్రూపునకు చెందిన హెచ్1ఎన్8 బయట పడింది. ఇది కేవలం కొట్టాయం, అలప్పుజ ప్రాంతాల్లోనే బయటపడడంతో కిలోమీటరు పరిధిలో పక్షుల నియంత్రణకు ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బర్డ్‌ఫ్లూనే ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అని కూడా చెబుతారు. వైరస్‌ల వల్ల ఇన్‌ఫెక్షన్ వస్తుంది. పక్షులకు తొందరగా వ్యాపిస్తుంది.
మనుషులపై ప్రభావం ఎంత..?
పక్షులకు, పక్షులు-పెంపుడు జంతువుల మధ్య వ్యాప్తిచెందే వైరస్.. మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఈ వైరస్ కారణంగా జబ్బుపడిన, చనిపోయిన పక్షులకు చేరువగా వెళ్లిన మనుషులకు ఇది సోకుతుంది. అయితే మనుషులు, మనుషుల మధ్య వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ. రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉండడం, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల అనారోగ్యం పాలైన వారికి సోకే అవకాశం ఉంటుంది.
Also Read ;- ఈ ఆహారంతో ‘రోగనిరోధక శక్తి’ని పెంచుకోండిలా..
బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఇవీ..
సాధారణం కంటే తీవ్రత ఎక్కువగా ఉన్న ఫ్లూ లక్షణాలే బర్డ్ ఫ్లూ కి గురైన వారిలోనూ కనిపిస్తాయి. తీవ్రమైన జలుబు, దగ్గు, డయేరియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం (100.4 డిగ్రీల కంటే ఎక్కువ), తలనొప్పి, కండరాల నొప్పి, గొంతు నొప్పిలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే వారు జాగ్రత్తలు తీసుకుంటే ఇతరులకు వ్యాప్తి చెందకుండా నియంత్రించవచ్చు.
రూపాంతరం చెందితే..
ప్రస్తుతం కనిపిస్తున్న వైరస్ హెచ్5 ఎన్1 రకం వైరస్. కేరళలో మాత్రమే హెచ్1 ఎన్1, 5, 8 లక్షణాలు కాకుల్లో కనిపించాయని వార్తలు వస్తున్నాయి. ఇది వైరస్ మ్యూటేట్ కావడంతో వ్యాధి రూపాంతరం చెందడం సహజమని చెబుతున్నారు. 1997లోనే మనషులకూ వస్తుందని గుర్తించారు. అంతకుముందు 1991లో హాంకాంగ్‌లో గుర్తించారని చెబుతున్నా.. దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇలా గుర్తించిన వారిలో చాలామంది..అప్పటికే ఆ వ్యాధి సంక్రమించిన పక్షులతో, జంతువులకు దగ్గరగా ఉన్నారని తేలింది.
ప్రభావం ఎక్కడ..
కొన్ని వైద్య సంస్థలు చెబుతున్న అంశం ప్రకారం..బర్డ్ ఫ్లూ పక్షుల రోగ నిరోదక శక్తిపై వెంటనే ప్రభావం చూపుతుంది. మనుషుల విషయానికి వస్తే.. తెల్ల రక్తకణాలపై ఉంటుంది. వెంటనే చికిత్స ప్రారంభించకపోతే..అది ఊపిరితిత్తులు, కణాజాలంపై ప్రభావం చూపుతుంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు తొలుత ఈ వైరస్ బారిన పడతారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే (యాంటీ వైరస్- సాధారణ అత్యవసర చికిత్స) 48గంటల్లోగా చికిత్స అవసరం. ఇక్కడే మరో విషయాన్ని కూడా వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి..అప్పటికే ఇతర ఫ్లూల ద్వారా బాధపడుతున్న వ్యక్తికి ఇది కూడా తోడైతే మరింత ప్రమాదకరమని చెబుతున్నారు.
ఒక్కటే మార్గం..
పక్షులు, ఇతర జంతువులలకు దగ్గరగా వెళ్లి వచ్చాక చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవడం (స్నానం చేయడం మేలు), అలా పక్షులు, ఇతర జంతువుల వద్దకు వెళ్లిన 10రోజుల్లోగా ఈ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ కావడం, చికెన్, గుడ్లు లాంటివి పూర్తిగా ఉడకబెట్టి (160గ్రేడ్‌కి తగ్గకుండా ) తినాలి. కాని హాఫ్ బాయిల్డ్, లేదా బయట మార్కెట్‌లో దొరికే ఇన్ స్టంట్ రెసిపీలతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read ;- ముంచుకొస్తోంది.. ‘బర్డ్ ఫ్లూ’ ముప్పు! కోడి మాంసం తినవచ్చా?











