ఈ కరోనా కాలంలో ఓటీటీలో వచ్చే చిత్రాలే జనానికి మంచి కాలక్షేపాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్, హారర్ జోనర్ లో వచ్చే చిత్రాలనే జనం ఎక్కువగా చూస్తున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా అలాంటి సినిమాలను ఎంచుకుని వాటికి తెలుగు సబ్ టైటిల్స్ జోడించడమో, అనువాదం చేసి విడుదల చేయడమో చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన విశ్లేషణను మనం ‘ఓటీటీ కాలమ్’ నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా మలయాళ చిత్రాలను జనం ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు.
అందుకే ‘ఆహా’ ఓటీటీ ఆయా భాషల్లో రూపొందిన హిట్ చిత్రాలను తెలుగులోకి అనువదించి విడుదల చేస్తోంది. ఈరోజు మనం చర్చించబోయే సినిమా ‘ఫోరెన్సిక్’. మలయాళంలో రూపొందిన ఈ సినిమా గత ఏడాది విడుదలైంది. టోవినో థామస్, మమతా మోహన్ దాస్, రెబా మోనిక్ తదితరులు నటించిన ఈ సినిమాకి అఖిల్ పౌల్-అనస్ ఖాన్ దర్శకత్వం వహించారు. ‘ఆహా’ ఓటీటీలో దీన్ని తెలుగులో చూడవచ్చు. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లోకి ఈ సినిమా వస్తుంది.
ఏమిటీ సినిమా ప్రత్యేకత?
ఇది క్రైమ్ నేపథ్యంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడంతో కథ ముగుస్తుంది. చిన్న పిల్లల్ని హత్య చేసే సీరియల్ కిల్లర్ కోసం పోలీసు డిపార్ట్ మెంట్ సామ్యూల్ జాన్ (టోవినో థామస్) మెడికో లీగల్ అడ్వైజర్ సహకారం తీసుకుంటుంది. సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఐ.పి.ఎస్ ఆఫీసర్ రితిక (మమతా మోహన్ దాస్)కు సహాయకుడిగా సామ్యూల్ చేరతాడు. వీరు సాగించే పరిశోధనలో ఎన్నో విషయాలు బయటపడతాయి. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? చిన్నపిల్లల్ని ఎందుకు చంపుతున్నాడు?
ఈ కేసును సామ్యూల్ ఎలా పరిష్కరించాడు అన్నదే కథ. మనిషిలో నేర ప్రవృత్తి ఎలా పెరుగుతుంది? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనే అంశాలను దర్శకులు చక్కగా చూపించారు. మమతా మోహన్ దాస్ చాలా కాలం తర్వాత తెర మీద కనిపించింది. ఆమె క్యాన్సర్ ను జయంచిన తర్వాత కూడా ఎంతో యాక్టివ్ గా నటించడం విశేషం. హీరోగా నటించిన టోవినో ధామస్ ‘లూసిఫర్’ తర్వాత ప్రేక్షకులకు ఈ సినిమాతో మరింత దగ్గరయ్యాడు. ముఖ్యంగా మలయాళ కథలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. వాటికి తగ్గట్టుగానే మరో మంచి హీరో మలయాళ పరిశ్రమకు దగ్గరయ్యాడనిపిస్తుంది.
పరిశోధనాత్మక ప్రయత్నం
నటుల నుంచి నటనను రాబట్టుకోవడం నిజంగా దర్శకులు చేసిన కృషేనని చెప్పక తప్పదు. ముఖ్యంగా చిన్న పిల్లల నటన అద్భుతంగా ఉంటుంది. సినిమా క్లైమాక్స్ మాత్రం తేలిపోయినట్టు అనిపిస్తుంది. కథను నడిపించడం కోసం కొన్ని అనవసర పాత్రలను చేర్చారని కూడా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళం ఉంటుంది. దానికి కొంత డబ్బింగ్ కూడా కారణం అయిఉండవచ్చు. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం సినిమాని మరో మెట్టు మీద నిలబెట్టింది. నేర పరిశోధనలో ఫోరెన్సిక్ పాత్ర ఏమిటన్నది చక్కగా చూపించారుగానీ అందులో కొంత స్పష్టత మిస్సయ్యింది.
ఇంకాస్త స్టడీ చేసి సినిమా తీస్తే బాగుండేది. ఈ కరోనా కాలంలో ఇంట్లో ఉండి సినిమా చూడాలనుకునేవారికి మాత్రం ఈ సినిమా మాత్రం మంచి ఆప్షన్ అనుకోవాలి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ కథలు ఇష్టపడేవారు చూడాల్సిన సినిమా. కథ, కథనాలే తప్ప పాటలు మాత్రం ఇందులో ఉండవు. అసలు సీరియల్ కిల్లర్ ఎవరు అనేది మాత్రం మన ఊహకు అందదు. అదే ఏ తెలుగు సినిమానో అయి ఉంటే ముగింపు కూడా మనకు సులభంగా తెలిసిపోతుంది. ఈ విషయంలో మలయాళ దర్శకులు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారనడానికి ఈ సినిమా ఓ ఉదాహరణ.
Must Read ;- హారర్ థ్రిల్లర్ తో భయపెట్టనున్న చందమామ











