తెలుగు హిట్ మూవీ బాహుబలిలో.. మాహిశ్మతి రాజ్యానికి కుంతల దేశం ఓ సామంత రాజ్యం. దానికి ఓ రాజు ఉన్నట్లే.. ఏపీలోని విశాఖ కూడా ఇప్పుడో సామంత రాజ్యమే. దానికి రాజు వేరెవరో కాదు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డే. ఇదేంటీ.. ప్రజాస్వా వ్యవస్థలో కూడా రాజ్యాలు, సామంతరాజ్యాలు, రాజులు, సామంతరాజులు కూడా ఉంటారా? అంటే.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి వ్యవహారం చూస్తుంటే.. భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలే ఉన్నా.. జగన్ పాలనలోని ఏపీలో మాత్రం సామంతరాజ్యాలు, వాటికి సామంత రాజులు కూడా ఉన్నారన్న భావనే కలుగుతోంది. ఏపీలోని నాలుగు జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్రకు సంబంధించిన పార్టీ వ్యవహారాలను సాయిరెడ్డే పర్యవేక్షిస్తున్నారు. పార్టీ వ్యవహారాలతో పాటు సర్కారీ వ్యవహారాలు కూడా ఆయన అనుమతి లేనిదే ముందుకు సాగడం లేదు. తాజాగా విశాఖను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు సాయిరెడ్ది ఏకంగా తీర ప్రాంతంతో అలరారుతున్న విదేశాలకు అధ్యయనం కోసం వెళుతున్నారు. ఇందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా అనుమతించింది.
సాయిరెడ్డి పర్యటన ఇలా..
విశాఖను సాగర నగరంగా కూడా మనం చాలా గొప్పగానే చెప్పుకుంటాం. పర్యాటకంగానే కాకుండా పారిశ్రామికంగా కూడా విశాఖ ఎప్పుడో అభివృద్ధి చెందిన నగరమే. ఏపీలో పర్యాటక పరంగా పేరెన్నికగన్న నగరం కూడా విశాఖే. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర రాజధానిగా ఎంపికైన అమరావతిని పురిట్లోనే చంపేసే దిశగా మూడు రాజధానుల ప్రతిపాదన తెర ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా విశాఖను రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మారుస్తామని జగన్ సర్కారు ప్రకటించింది. ఈ క్రమంలో విశాఖపై పట్టు సాధించే దిశగా సాయిరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. విశాఖలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను అన్నింటినీ సాయిరెడ్డే పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి క్రమంలో విశాఖను పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేయాలని సాయిరెడ్డి తలచారట. ఇందులో భాగంగా తీర ప్రాంత దేశాలుగా పర్యాటక పరంగా మెరుగైన ఆదాయాన్ని సాధిస్తున్న దుబాయి, మాల్దీదులు, బాలి వంటి దేశాల పర్యటనకు వెళ్లాలని ఆయన భావించారు. అయితే జగన్ అక్రమాస్తుల కేసులన్నింటిలో సాయిరెడ్డి ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జగన్ మాదిరే సాయిరెడ్డి కూడా బెయిల్ పై జైలు బయట ఉన్నారు. బెయిల్ పై ఉన్న వారు విదేశాలకు వెళ్లాలంటే.. కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే కదా. అందుకే కాబోలు.. సీబీఐ కోర్టును విదేశీ పర్యటనకు అభ్యర్థిస్తూ సాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తన ఉద్దేశాన్ని కోర్టుకు చెప్పిన సాయిరెడ్డి.. పై మూడు దేశాల పర్యటనకు అనుమతి కూడా తీసుకున్నారు.
అవంతి ఉత్తరాంధ్రకు మంత్రి కాదా?
ఏపీ కేబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ పర్యాటక శాఖ మంత్రి అంటే.. ఏపీ మొత్తానికి.. మరీ ప్రత్యేకించి చెప్పాలంటే.. విశాఖకు కూడా ఆయనే పర్యాటక శాఖ మంత్రి కదా. మరి అలాంటప్పుడు పర్యాటక శాఖ మంత్రితో సంబంధం లేనట్లుగా విశాఖ పర్యాటకాభివృద్ధిపై ఎంపీ హోదాలో తాను విదేశాలకు వెళుతున్నానని సాయిరెడ్ది చెప్పడం ఆశ్చర్యమే కదా. అంటే.. సాయిరెడ్డి భావనలో అవంతి విశాఖకు సంబంధించని మంత్రే కదా. ఉత్తరాంధ్ర.. అందులోని విశాఖ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని మంత్రిగానే అవంతిని సాయిరెడ్డి చూస్తున్నారన్న వాదనలు ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నాయి. అయినా పర్యాటక రంగ అభివృద్థి కోసం విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తే.. ఆ శాఖ మంత్రిగా అవంతి గానీ, సీఎం హోదాలో జగన్ గానీ చేయాలి. మరి వారిద్దరినీ కాదని ఎంపీగా ఉన్న సాయిరెడ్డి ఆ తరహా పర్యటనలకు వెళుతుంటే.. విశాఖను ఆయన తన సొంత రాజ్యంగా భావిస్తున్నట్లే కదా. అందుకే.. ఏపీని మాహిశ్మతి రాజ్యంగా, విశాఖను ఆ రాజ్యానికి ఉన్న సామంత రాజ్యంగా.. ఆ సామంత రాజ్యానికి రాజుగా సాయిరెడ్డేనని భావించక తప్పదు కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- బాబు, జగన్ జమానాల లెక్క ఇది!