టీడీపీ సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోమారు అరెస్ట్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన నేతలు వరుసగా టార్గెట్ అవుతుండగా.. ఆ జాబితాలో చింతమనేని అందరి కంటే ముందున్నారని చెప్పాలి. ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయిన చింతమనేని సోమవారం మరోమారు అరెస్టయ్యారు. అయితే ఈ దఫా పోలీసులు చెప్పిన కారణం చూస్తుంటే.. ఏ కారణం లేకుండా కూడా చింతమనేని సహా ఇతర టీడీపీ నేతలను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా వైసీపీ సర్కారు సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా టీడీపీ నేతల అరెస్ట్ విషయంలో వెనక్కు తగ్గేదే లేదన్న కోణంలో వైసీపీ సర్కారు సాగుతోందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
కారణం కోసం వెతుక్కున్నారే
చింతమనేనిని సోమవారం ఉదయం అరెస్ట్ చేయగా.. ఆ విషయాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ధృవీకరించారు. అయితే చింతమనేనిని ఎందుకు అరెస్ట్ చేశామన్న విషయంపై ఎస్పీ చెప్పిన కారణం మాత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది. విశాఖ జిల్లా పరిధిలోని ధారకొండ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు పర్యటిండచమే కాకుండా అక్కడ అలజడి సృష్టించారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. చెక్ పోస్టు వద్ద కార్లలో కొందరు కనిపించారని, ఓ కారులో చింతమనేనిని గుర్తించామని ఎస్పీ చెప్పారు. అటవీ ప్రాంతంలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే.. చింతమనేని పొంతన లేని సమాధానం ఇచ్చారట. దీంతో పొంతనలేని సమాధానం ఇవ్వడమే కాకుండా పోలీసులను తప్పుదారి పట్టించిన కారణాన్ని చూపిన పోలీసులు చింతమనేనిని అరెస్ట్ చేశామని చెప్పారు. ప్రస్తుతం చింతమనేనిని విశాఖ జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు తరలిస్తున్నామని ఎస్పీ చెప్పుకొచ్చారు. అంటే.. కేవలం అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదన్న కారణం చూపి మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారన్న మాట.
దుగ్గిరాలలో ఉద్రిక్తత.. బాబు ఖండన
చింతమనేనికి ఏ మేర మాస్ ఫాలోయింగ్ ఉందో ఇప్పటికే చాలా సార్లు చూశాం కదా. గతంలో ఆయనను అరెస్ట్ చేసిన సందర్భంగా దుగ్గిరాలలోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఏ మేర ప్రతిఘటనను ఎదుర్కొన్నారో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా సోమవారం ఉదయమే చింతమనేని అరెస్టయ్యారన్న సమాచారం అందగానే.. ఆయన అభిమానులు దుగ్గిరాలలోని ఆయన నివాసానికి భారీగా చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. వెరసి అక్కడ ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. చింతమనేని అరెస్ట్ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండిచారు. ఏ నేరం చేయకున్నా తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తారా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చింతమనేనిని విడుదల చేయాలని, లేనిపక్షంలో టీడీపీ నుంచి భారీ నిరసనను చవిచూడాల్సి వస్తుందని చెబుతూ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగదలపై నిరసనలు చేసే హక్కు కూడా తమ పార్టీ నేతలకు లేదా అని ాయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Must Read ;- ఏపీకి యాక్టింగ్ సీఎంగా సజ్జల?











