అనుకున్నంతా అయ్యింది. నియమ నిబంధనలతో పాటు కోర్టుల ఆదేశాలను పాటించడం లేదన్న సంచలన ఆరోపణలు చాలా కాలం నుంచి జగన్ సర్కారుపై వినిపిస్తున్నవే కదా. ఆ ఆరోపణలు నిజమేనని తేలింది. ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు హద్దులు దాటిందని తేలిపోయింది. నిబంధనలకు పాతరేయడమే కాకుండా.. ఏకంగా జాతీయ హరిత ట్రిబ్యూనల్ ఆదేశాలను కూడా తుంగలో తొక్కేసిందని కూడా నిర్ధారణ అయిపోయింది. ఈ మేరకు కృష్ణా జలాల యాజమాన్య బోర్డు తన క్షేత్ర స్థాయి పరిశీలనలో జగన్ సర్కారు ధిక్కరణను నిగ్గు తేల్చింది. ఇదే అంశాన్ని కీలకంగా ప్రస్తావిస్తూ ఎన్జీటీకి సమగ్ర నివేదికను అందజేసింది. ఈ వ్యవహారం ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణలోనూ కొత్త తరహా చర్చకు తెర తీసిందనే చెప్పాలి.
కొత్త పంచాయతీ ఇదే
రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యాన్నిజగన్ సర్కారు రెండింతలు చేస్తోందని తెలంగాణ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అసలు రెండు రాష్ట్రాల మధ్య కొత్త జల వివాదానికి ఆజ్యం పోసిన విషయం కూడా ఇదే. రాయలసీమ ఎత్తిపోతలను జగన్ సర్కారు ప్రారంభిస్తే.. కృష్ణా జలాల్లో తనకు సగం కావాల్సిందేనని తెలంగాణ సర్కారు వాదులాకు దిగింది. దీంతో సమస్య కోర్టులను దాటేసి కేంద్రం చెంతకు చేరింది. అయితే కేంద్రంలోని మోదీ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేసి అటు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులతో పాటు ఇటు గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను బోర్డులకు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఏకంగా ఈ బోర్డుల వ్యయాన్ని ఇరు రాష్ట్రాలే భరించాలని కూడా కేంద్రం షరతు పెట్టింది. దీనిపై జగన్ సర్కారు నోరు విప్పకున్నా.. కేసీఆర్ సర్కారు మాత్రం తనదైన శైలి నిరసన వ్యక్తం చేసింది. బోర్డులకు పూర్తి అధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ సర్కారు మౌనం వహించిన నాడే.. జగన్ సర్కారు ఏదో తప్పు చేస్తోందన్న వాదనలు వినిపించాయి.
కేఆర్ఎంబీ తేల్చిందిదే
ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఎన్జీటీని ఆశ్రయించగా.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉందని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఈ బాధ్యతలను కేఆర్ఎంబీకే అప్పగించింది. ఎన్జీటీ ఆదేశాలతో కేఆర్ఎంబీ రంగంలోకి దిగితే.. ఆ కమిటీలో తెలంగాణకు చెందిన వ్యక్తి ఉన్నారని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆ సభ్యుడిని తీసేసిన కేఆర్ఎంబీ బృందం రెండు రోజుల క్రితం సీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించింది. అనంతరం క్షేత్రస్థాయి పరిశీలనలో తాను గుర్తించిన అంశాలతో నివేదికను రూపొందించి దానిని శనివారం నేరుగా ఎన్జీటీకి అందజేసింది. ఈ నివేదికలో ఏమున్నాయన్న అంశానికి వస్తే.. తెలంగాణ ఆరోపిస్తున్నట్లుగా రాయలసీమ ఎత్తిపోతల పథకంలో జగన్ సర్కారు నిబంధనలకు నీళ్లొదిలిందట. అంతేకాకుండా తాను చెబుతున్న దాని కంటే కూడా జగన్ సర్కారు అక్కడ ఎక్కువ పనులే చేసిందట. ఇంకా ఎన్జీటీ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా పాటించలేదట. ఇప్పుడు ఈ నివేదికను ఆధారం చేసుకుని ఎన్జీటీ ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారిపోయింది.
Must Read ;- భారీ స్కాంలో జగన్ జిల్లా కీలక భూమిక