టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాప్ హీరో అయి ఉండి కూడా రోడ్ సైడ్ హోటల్ లో టిఫిన్ చేశారంటూ బన్నీ అభిమానులు ఈ వీడియోను తొలుత సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ గా మారింది. అయితే ఏదో అలా తన సినిమా షూటింగ్ కోసం వెళుతూ.. ఆకలేసిన సమయంలో తనకు కనిపించిన హోటల్ చిన్నదో, పెద్దదో అని చూసుకోకుండా అల్లు అర్జున్ తన వాహన శ్రేణిని ఆపేసి ఆ చిన్న హోటల్ లోనే టిఫిన్ చేయడం ఒకింత ఆహ్వానించదగ్గదే అయినా.. తన టిఫిన్ కోసం అల్లు అర్జున్ ఎంపిక చేసుకున్న ప్రాంతం.. అక్కడ కనిపించిన దృశ్యాలను చూశాకే ఈ వీడియో మరింత వైరల్ గా మారిందని చెప్పాలి.
ఆ ప్రత్యేకత ఏమంటే..?
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ పేరిట తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా భాగం అటవీ ప్రాంతాల్లోనే చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల తన సినిమా షూటింగ్ కోసం తన చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మన్యం ప్రాంతానికి బయలుదేరారు. ఈ జిల్లాలోని దట్టమైన అడవులు ఉన్న సంగతి తెలిసిందే. అలా ఘాట్ రోడ్డులో వెళుతున్న బన్నీ.. సరిగ్గా జిల్లాలోని గోకవరం గ్రామం మీదుగా వెళుతుండగా.. అక్కడ రోడ్డు పక్కగా ఓ హోటల్ కనిపించగా.. అక్కడే ఆయన ఆగారు. బన్నీ ఆగిన ఆ ప్రాంతంలో ఓ వైపున టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం ఉండగా.. మరో వైపు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఉంది. ఎడమ చేతితో ఎన్టీఆర్ కార్యకర్తలను పిలుస్తున్నట్టుగా ఉంటే.. కుడి చేతితో కార్యకర్తలకు అభివాదం చేస్తున్నట్లుగా వైఎస్సార్ విగ్రహం ఉంది. బన్నీ ఈ అరుదైన దృశ్యాన్ని గమనించారో, లేదో తెలియదు గానీ.. సరిగ్గా ఆ రెండు విగ్రహాల మధ్యలోనే తన కారును ఆపేశారు. పూరి గుడిసెలాంటి హోటల్ లో టిఫిన్ చేసి డబ్బుల్చిన తర్వాత బన్నీ తన కారు ఎక్కేందుకు రాగా.. సరిగ్గా ఆయన ఆ రెండు విగ్రహాల మధ్యే కనిపించారు. ఈ దృశ్యంతోనే బన్నీ వీడియో మరింతగా వైరల్ అయ్యిందని చెప్పాలి.
Must Read ;- కేజీఎఫ్ 2 తప్పుకోవడం.. పుష్పకి లైన్ క్లియర్.. రిలీజ్ డేట్ ఇదే