టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి తొలగింపు, రాజీనామాల అంశం ఒక్క కరీంనగర్‌కే పరిమితం కాదన్న అంచనాల నేపథ్యంలో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే కేసీఆర్ అమలు చేసే అటెన్షన్ డైవర్ట్ వ్యూహం హుజూరాబాద్‌లోనూ అమలు చేయనున్నారని చెప్పవచ్చు.
రంగంలో మంత్రులు..
ఈటల రాజేందర్‌పై భూ ఆక్రమణ ఆరోపణలు రావడం, ఆ తరువాత ఈటల కేసీఆర్ పై విమర్శలు చేయడంతో వెంటనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంత్రులు రంగంలోకి దిగారు. గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు డైరెక్ట్‌గా విమర్శించగా కేటీఆర్ పరోక్షంగా స్పందించారని చెప్పవచ్చు. ఈటలకు ఉద్వాసన పలకడానికి ముందే నియోజకవర్గంలోని కీలక నేతలతో ముఖ్య నాయకులు టచ్‌లో ఉండేలా చూడడంతో ఈటల వెనుక ఎవరు లేరనే అభిప్రాయం కలిగేలా చేయవచ్చనే వ్యూహాన్ని కూడా అమలు చేశారు. తాజాగా ఈటల రాజీనామా ఆమోదం పొందాక ఆరునెలల్లోపు ఎన్నిక జరపాల్సి ఉంటుంది.అంటే డిసెంబరులోపు హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది.
ఈటలను ఓడించి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుంటూ..
హుజూరాబాద్‌లో ఈటలను ఓడించి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని కేసీఆర్ భావించి ఉండవచ్చని, తనతో 19ఏళ్ల పాటు సావాసం చేసిన వ్యక్తి కావడంతో టీఆర్ఎస్‌లోని కొంతమంది నాయకులు ఈటల విషయంలో అంత దూకుడుగా వెళ్లలేక పోవచ్చని, ఈ నేపథ్యంలో తానే ముందుండి కొన్నాళ్ల పాటు నడిపించాలని భావించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ నెల 7న కేసీఆర్ కరీంనగర్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన ద్వారా హుజూరాబాద్ నియోజకవర్గంలో అటెన్షన్ డైవర్ట్ వచ్చు. కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని సందర్శించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నట్లు చెబుతున్నారు. ఆస్పత్రిలో కోవిడ్ బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం స్థానిక వైద్యాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. గతంలోనూ రెండు మూడు పర్యటనలు చివరి నిమిషంలో రద్దైన విషయం తెలిసిందే. కేసీఆర్ కరీంనగర్ పర్యటన ఉన్నా, లేకున్నా హుజూరాబాద్ విషయంలో రోజూవారి సమీక్ష చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక రెండు రోజుల క్రిత్రమే పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ వేములవాడలో ఆసుపత్రి ప్రారంభించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ విదేశాల్లోనే ఉండడం, పౌరసత్వ వివాదం, టీఆర్ఎస్ పై విమర్శలు లాంటి అంశాలు అదే జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంపై పడకుండా కేటీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.అందులో భాగంగానే కొన్ని రోజులుగా వేములవాడకు సంబంధించిన కార్యకలాపాలు కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి గంగుల కమలాకర్ కొద్ది రోజులు హుజురాబాద్‌లోనే మకాం వేసి పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించారని చెప్పవచ్చు. ఉప ఎన్నిక ముగిసే వరకూ నియోజకవర్గంపై పార్టీ పట్టు సడలకుండా ఉండేలా గులాబీ బాస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు.
Must Read ;- కేసీఆర్ భయపడేది బీజేపీకే.. అందుకే ఈటల అడుగులు అటు
ఆపరేషన్ ఆకర్ష్ కూడా..
అదే సమయంలో ఆపరేషన్ ఆకర్ష్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ బీజేపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. తనను సంప్రదించకుండా తన నియోజకవర్గానికి చెందిన ఈటలతో చర్చలు జరపడం ఏంటని, హుజూరాబాద్ నుంచే తాను పోటీ చేస్తానని ఇప్పటికే పెద్దిరెడ్డి బహిరంగంగానే పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే పెద్దిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ఇక స్వతంత్రుడిగా పోటీ చేస్తారా లేక ఏ పార్టీలో చేరతారు అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పరిణామాలను బట్టి ఆపరేష్ ఆకర్ష్‌ను టీఆర్ఎస్ అమలు చేయవచ్చని తెలుస్తోంది. మొత్తం మీద ఈటల రాజీనామా చేసిన కొద్ది వ్యవధిలోనే సీఎం కేసీఆర్ పర్యటన వార్త బయటకు రావడం చర్చనీయాంశమైంది.
Also Read ;- ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం : తుల ఉమ