టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు శస్త్ర చికిత్స జరిగింది. ఇటీవల కరోనా బారిన పడిన గంటా.. వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే కొవిడ్ తదనంతరం తలెత్తిన చిన్నపాటి సమస్యతో ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో గుండె కవాటానికి సమీపంలో ఇన్ఫెక్షన్ ను గుర్తించిన వైద్యులు దానిని సరిచేసేందుకు శస్త్ర చికిత్స చేశారు. చిన్నపాటి సర్జరీనే అయినా.. గంటాకు ఆపరేషన్ అనగానే ఆయన అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అయితే ఆపరేషన్ తర్వాత గంటా ఆరోగ్యం నిలకడగానే ఉందని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీంతో ఆయన అనుచరవర్గం ఊపిరి పీల్చుకుంది.
వ్యాపారాల్లో నుంచి రాజకీయాల్లోకి..
వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు సంపాదించిన గంటా శ్రీనివాసరావు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో చక్రం తిప్పారు. విశాఖ కేంద్రంగా రాజకీయాలు నడిపిన ఆయన అక్కడి హేమాహేమీలకు ముచ్చెమటలు పట్టించారనే చెప్పాలి. అంతేకాకుండా ఏ నియోజకవర్గంలోనూ రెండో సారి పోటీ చేయకుండా ప్రతి సారీ నియోజకవర్గం మారుస్తున్న ఆయన ఓటమే లేకుండా సాగుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన గంటా.. వైసీపీ వైపు వీచిన గాలిలోనూ గెలిచి నిలిచారు.
చిన్నపాటి సర్జరీనే
అటు కాంగ్రెస్ తో పాటు ఇటు టీడీపీలోనూ మంత్రిగా పదవి సంపాదించిన గంటా.. ఇటీవలి కాలంలో రాజకీయంగా అంతగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. ఓ వైపు తాను కొనసాగుతున్న టీడీపీ ఓటమిపాలు కావడం, అదే సమయంలో వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదురుకావడం.. ఇంకోవైపు తమ పార్టీలోకి చేరాలంటూ వైసీపీ ఒత్తిళ్లు.. వెరసి గంటా సైలెంట్ అయిపోయారు. అయితే ఇటీవల కరోనా బారిన పడిన ఆయన కొంతకాలం పాటు బయటకే రాలేదు. కరోనా నుంచి కోలుకున్నా.. కరోనా అనంతర సమస్యలతో ఆయన అపోలోలో చేరారు. ఆపరేషన్ పూర్తి అయిన నేపథ్యంలో త్వరలోనే ఆయనను డిశ్చార్జీ చేయనున్నట్లుగా అపోలో వైద్యులు ప్రకటించారు.
Must Read ;- వైసీపీ దిశగా రత్నప్రభ అడుగులు?











