వివాదం పాతదే. అయితే అది ఇప్పుడు కొత్త రూపు దాల్చుకుంది. తెలంగాణ గవర్నర్ హోదాలో ఉన్న తమిళిసై సౌందరరాజన్ చేసిన ట్వీట్ వేదికగా ఈ పాత వివాదం సరికొత్త రీతిలో ప్రొజెక్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని ఎప్పటినుంచో బీజేపీ జరుపుకుంటోంది. అయితే ఆ రోజు తెలంగాణ విమోచన దినం కాదని, అది తెలంగాణ విలీన దినమని టీఆర్ఎస్ వాదిస్తోంది. ఏటా సెప్టెంబర్ 17 వచ్చిందంటే చాలు ఇదే విషయంపై ఇరు వర్గాలు వాదులాడుకుంటూనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడిన సమయంలోనూ ఇదే తరహా వివాదం రేకెత్తేది. బీజేపీ నేతలు విమోచన దినం పేరిట కార్యక్రమాలు జరిపితే.. వాటిని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టీఆర్ఎస్ కూడా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమం సాగిన నేపథ్యంలో ఈ విషయంపై టీఆర్ఎస్ కాస్తంత పట్టూవిడుపులతో సాగితే.. బీజేపీ మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నట్లుగా సాగింది.
గవర్నర్ ట్వీట్ తో సీఎం షాక్
ఇలాంటి నేపథ్యంలో శుక్రవారం (సెప్టెంబర్ 17) ఉదయమే ట్విట్టర్ వేదికగా గవర్నర్ తమిళిసై సంచలన ట్వీట్ ను చేశారు. ‘‘సెప్టెంబర్ 17 న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’’అంటూ ఆమె చేసిన ట్వీట్ ను కేసీఆర్ సర్కారు అసలు ఊహించలేదనే చెప్పాలి. ఎందుకంటే.. గవర్నర్ పదవిలో ఉన్న నేతలు.. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో సఖ్యతగానే వ్యవహరిస్తూ ఉంటారు కదా. అయితే తమిళిసై బీజేపీకి చెందిన తమిళనాడు నేత. అయినా కూడా తెలంగాణ గవర్నర్ హోదాలో ఉన్న ఆమె ప్రభుత్వ, ప్రజల ఆశయాలకు అనుగుణంగానే వ్యవహరించాలన్న వాదనలు లేకపోలేదు. ఈ వాదనలను అంతగా పట్టించుకోని తమిళిసై బీజేపీ సిద్ధాంతాన్ని ప్రతిభింబించేలా తెలంగాణ విమోచన దినం పేరిట ట్వీట్ పెట్టేవారు. ఈ ట్వీట్ కేసీఆర్ సర్కారుకు నిజంగానే షాక్ గానే పరిగణించక తప్పదు.
మోదీ బర్త్ డే విషెస్ కంటే ముందే..
వాస్తవానికి సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. ఈ సందర్భంగా బీజేపీ నేతల నుంచి మోదీకి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయినా కూడా తమిళిసై మాత్రం ముందుగా తెలంగాణ విమోచన దినం గ్రీటింగ్స్ తెలిపిన తర్వాతే.. మోదీకి బర్త్ డే విషెస్ తెలపడం గమనార్హం. ట్విట్టర్ లో యమా యాక్టివ్ గా కనిపించే తమిళిసై.. శుక్రవారం ఉదయమే 6.53 గంటలకే తెలంగాణ విమోచన దినంపై ట్వీట్ చేశారు. ఆ తర్వాత గంటన్నర తర్వాత ఎప్పుడో 8.18 గంటలకు మోదీకి బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. దీనిని చూస్తుంటేనే.. తెలంగాణ విమోచన దినానికి తమిళిసై ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ఇట్టే అర్థం కాక మానదు. బీజేపీ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు.. ప్రత్యేకించి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన మేరకే తమిళిసై ఈ దిశగా తెలంగాణ విమోచన దినానికి అత్యధిక ప్రయారిటీ ఇచ్చినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్!