పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ చదరంగంలో అభిమన్యుడిగా మారిపోయారా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే.. తనకు రాజకీయ పాఠాలు నేర్పిన కాంగ్రెస్ పార్టీకి వెన్ను పొడిచేలా వ్యవహరించి ఆపై టీఆర్ఎస్ చేరిన కౌశిక్ రెడ్ది.. పద్మవ్యూహంలో అభిమన్యుడి మాదిరిగా టీఆర్ఎస్ లోకి అయితే చేరిపోయాడు గానీ.. పదవి సాధించే మార్గం దొరకక, ఆ పార్టీ నుంచి బయటకు రాలేక.. అక్కడే దాదాపుగా స్తంభించిపోయారు. వెరసి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసినా.. ఇంకా ఎమ్మెల్సీ పదవి దక్కక.. అదేమైందో తెలపండి అని అడగలేక.. తాను మోసపోయానని గుర్తించినా బయటకు రాలేక.. కౌశిక్ రెడ్డి నిజంగానే ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు.
ఎందుకిలా జరిగిందంటే..?
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డే. అందులో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై పొటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి పని చేస్తుంది కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే అభ్యర్థి బరిలోకి దిగే ఛాన్సే లేదు. ఇదే విషయాన్ని పసిగట్టిన టీఆర్ఎస్ నేతలు కౌశిక్ రెడ్డిపైకి వల విసిరారు. ఈ వలకు చిక్కకుండా జాగ్రత్తగా మసలుకోవాల్సిన కౌశిక్ రెడ్డి.. పదవి ఆశ చూపగానే జంప్ కొట్టేందుకు సిద్ధమైపోయారు. అయితే టీఆర్ఎస్ వ్యూహం మేరకు ఆ పార్టీ నేతలు చెప్పేదాకా కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉండాలి. ఈ నిబంధనను జాగ్రత్తగా పాటించే విషయంలో కౌశిక్ పొరపాటు చేసి దొరికిపోయారు. ఫలితంగా ముహూర్తం కంటే ముందుగానే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోక తప్పలేదు. హుజూరాబాద్ లో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ఉన్న టీఆర్ఎస్.. ఆ నియోజకవర్గానికి చెందిన నేతలకు పదవులు ఎరవేస్తున్న క్రమంలో కౌశిక్ కు ఏకంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. అయితే ఈ తంతు ముగియాలంటే.. గవర్నర్ ఆమోద ముద్ర వేయాలి కదా. అక్కడే చిక్కొచ్చి పడింది.
ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే..?
నేరుగా కేబినెట్ భేటీలోనే కౌశిక్ ను గర్నరర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ.. ఆ నిర్ణయానికి ఆమోదం తెలపాలంటూ గవర్నర్ తమిళిసైకి ఫైలును పంపింది. ఈ క్రమంలో కౌశిక్ ను సామాజిక సేవా విభాగంలో నామినేట్ చేస్తున్నట్లుగా కేసీఆర్ సర్కారు పేర్కొంది. సామాజిక సేవ అంటే.. ఎంతో కొంతైనా చేసి ఉండాలి కదా. అలా కాకుండా సామాజిక సేవా కోటా కింద రాజకీయ నేతలను ఎమ్మెల్సీలుగా ఆమోదించమంటే గవర్నర్ కళ్లు మూసుకుని సంతకం పెట్టేయరు కదా. ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా ఉన్న బీజేపీ మహిళా నేత తమిళిసై కూడా అదే చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటిదాకా స్పందించని తమిళిసై బుధవారం నోరు విప్పారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే.. ‘‘కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.సామాజిక సేవా విభాగంలో పంపినందున పరిశీలిస్తున్నాం. తెంగాణ మంత్రిమండలి సిఫారసుపై ఇంకా అధ్యయనం చేస్తున్నాం.. ఆమోదించే విషయంలో ఇంకాస్త సమయం పడుతుంది’’ అంటూ తమిళిసై కుండబద్దలు కొట్టారు. వెరసి తన ఎమ్మెల్సీ గిరీపై తమిళిసై సంతకం పెడతారో, పెట్టరో.. తెలియక.. ఒక వేళ తిరస్కరణకు గురైతే ఏం చేయాలో పాలుపోక కౌశిక్ రెడ్డి నిజంగానే దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
Must Read ;- సారూ.. మీ జడ్పీ సీఈఓ మాట విన్నారా?