దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న పౌరాణిక ప్రణయ గాథ ‘శాకుంతలం’. మహాభారతంలోని ఆది పర్వంలోని శకుంతల , దుష్యంతుల ప్రణయ కావ్యాన్ని దర్శకుడు తనదైన శైలిలో తెలుగు తెరపై ఆవిష్కరిస్తున్నారు. శకుంతలగా సమంతా అక్కినేని అభినయిస్తుండగా.. దుష్యంతుడిగా.. మలయాళ నటుడు దేవ్ కమల్ నటిస్తున్నాడు. ఇక ఇందులో దూర్వాస మహాముని పాత్రను విలక్షణ నటుడు మోహన్ బాబు పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
మొన్నీమధ్యనే అన్నపూర్ణా స్టూడియోస్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ‘శాకుంతలం’ సినిమా .. రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా పై టాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ అయింది. సమంతా సినీ కెరీర్ లో .. ఆమె నటిస్తున్న మొట్టమొదటి పౌరాణిక చిత్రంగా శాకుంతలం సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది. శాకుంతలం సినిమాకి సంబంధించిన షూటింగ్ వివరాల్ని గుణశేఖర్ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేశారు. 7 వ సీన్ .. 9వ షాట్ .. టేక్ 1 అంటూ.. సినిమాకు సంబంధించిన ప్రోగ్రెస్ ను అందించారు గుణశేఖర్.
మేనక, విశ్వామిత్రుల సంగమం ద్వారా జన్మించిన ఆడబిడ్డను శాకుంతలం పక్షులు పెంచడం ద్వారా ఆమె శకుంతల అయింది. కణ్వమహర్షి ఆమెను తన కన్న బిడ్డలా సాకుతారు. ఆయన్ను తన సొంత తండ్రిలాగానే భావిస్తుంది శకుంతల. దుష్యంతుడు ఆమెను తొలి చూపులోనే మోహించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో శకుంతల, దుష్యంతులు విడిపోతారు. చివరికి వారిద్దరూ ఎలా ఒకటవుతారు అన్నదే మిగిలిన కథ. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతంలం’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో అద్భుతంగా వేసిన సెట్స్ లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు గుణశేఖర్. అలాగే.. ఈ సినిమా కోసం భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్ ను రూపొందిస్తున్నారు.
Must Read ;- ఫుల్ స్వింగ్ లో ‘శాకుంతలం’ మ్యూజిక్ సిట్టింగ్స్