తెలుగు నేల రాజకీయాల్లో సీనియర్ రాజకీయవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత జీవీ హర్షకుమార్ పరిచయం అక్కర్లేని నేతగానే చెప్పాలి. దళిత సామాజిక వర్గానికి చెందిన జీవీ.. తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా రాజకీయాలు నడిపిన జీవీ.. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అమలాపురం పార్లమెంటు నుంచి 2004, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. వరుసబెట్టి రెండు పర్యాయాలు ఒకే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన జీవీ.. లోక్ సభకు స్పీకర్ గా వ్యవహరించిన దివంగత నేత జీఎంసీ బాలయోగి ప్రాతినిధ్యం వహించిన అమలాపురం నుంచే ఓ వెలుగు వెలిగారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టేలా మాట్లాడే జీవీ.. ప్రత్యర్థి పార్టీల నేతలకు సింహస్వప్నంలానే మారారని చెప్పాలి. అలాంటి నేత ఇప్పుడు హఠాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. జీవీ రాజకీయాలకు స్వస్తి చెప్పడానికి దారి తీసిన పరిణామాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.
కొడుకు తప్పు లేకున్నా శిక్ష
అయినా జీవీ రాజకీయాల్లో నుంచే తప్పుకునే దిశగా ఎలా కదిలారన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జీవీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ ప్రస్తుతం యువజన కాంగ్రెస్ లో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ వ్యవహారాల్లో యమా యాక్టివ్ గా కనిపించే శ్రీరాజ్ సోషల్ మీడియాలో తనదైన శైలి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో శ్రీరాజ్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు నిన్న సంచలన ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న శ్రీరాజ్.. ఇటీవల రాహుల్ గాంధీకి చెందిన అకౌంట్ ను ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపివేసిన సమయంలో ఓ వివాదాస్పద వీడియోను పోస్ట్ చేశారట. ఈ పోస్ట్ పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించేదిగానే ఉందట. దీనిపై విచారణ చేపట్టిన పార్టీ క్రమశిక్షణ సంఘం శ్రీరాజ్ ది తప్పేనని నిర్ధారించి.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందట. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన జీవీ.. చేయని తప్పుకు తన కుమారుడికి శిక్ష వేస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏకంగా రాజకీయాల్లో నుంచే తప్పుకోబోతున్నట్లుగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయింది.
జీవీ ప్రస్థానమిదే
కాంగ్రెస్ పార్టీతోనే రాజయ ప్రస్థానం ప్రారంభించిన జీవీ.. కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం ఎన్ఎస్‌యూఐ, ఆ తర్వాత యువజన కాంగ్రెస్ లలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఓ దఫా ఎమ్మెల్యేగా టికెట్ దక్కించుకున్న ఆయన ఎన్టీఆర్ ప్రభంజనంలో గెలవలేకపోయారు. ఆ తర్వాత కూడా రాజమహేంద్రవరం మేయర్ పదవికి పోటీ చేసి ఓడిపోయినా.. కాంగ్రెస్ సత్తా ఏమిటో మరోమారు రుజువు చేశారు. ఆ తర్వాత అమలాపురం పార్లమెంటు నుంచి మూడు పర్యాయాలు పోటీ చేసి తొలి రెండు పర్యాయాల్లో విజయం సాధించినా.. మూడో పర్యాయం ఓటమిపాలయ్యారు. తెలుగు నేల విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ జీరోగా మారిపోయిన సమయంలో కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరిన జీవీ.. టీడీపీలో ఇమడలేకపోయారనే చెప్పాలి. ఈ క్రమంలో 2020లో మరోమారు తన సొంత పార్టీ కాంగ్రెస్ లోనే చేరిపోయారు. పార్టీ నిర్వహించే దాదాపుగా అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్ గానే పాలుపంచుకుంటున్న జీవీ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా పరిణమించే నేతల్లో ఒకరిగా మారారు. పార్టీలో సీనియర్ గా ఉన్న జీవీ.. తన కుమారుడు శ్రీరాజ్ యూత్ కాంగ్రెస్ లో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటనకు నిరసనగానే జీవీ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మరి జీవీని పార్టీ బుజ్జగిస్తుందా?.. జీవీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.
Must Read ;- కొండా సురేఖ ఓకే.. మిగిలిన ఇద్దరెవరు?