ప్రాంతీయ పార్టీల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న రాజకీయ పార్టీ తెలుగు దేశం పార్టీలో గురువారం నాడు పెను తుఫాను మొదలైనట్లుగా వార్తలు వినిపించాయి. పార్టీకి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయనున్నారన్న ఈ వార్తలు నిజమేనేమోనని కూడా టీడీపీ శ్రేణులు భయాందోళనకు గురైన మాట కూడా వాస్తవమే. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ వెంటే సాగుతున్న గోరంట్ల పార్టీని వీడి ఎక్కడికీ పోవడం లేదని తాజాగా తేలిపోయింది. పార్టీ అధిష్ఠానంపై తనలోని అసంతృప్తిని వ్యక్తం చేసిన గోరంట్ల.. ఆ అసంతృప్తిని తొలగిస్తే.. ఎక్కడికీ వెళ్లరని, నిన్ననే చాలా కథనాలు వినిపించాయి. ఇదే విషయాన్ని గుర్తించిన పార్టీ అధిష్ఠానం తక్షణమే స్పందించింది కూడా. రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో పార్టీ సీనియర్ నేత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రి కేఎస్ జవహర్ లతో కూడిన త్రిసభ్య కమిటీని పార్టీ హైకమాండ్ గోరంట్ల వద్దకు పంపింది. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని గోరంట్ల స్వగృహంలో ఆయనతో కమిటీ భేటీ అయి చర్చిస్తోంది.
పార్టీని వీడేంత సమస్య కాదు
పార్టీలో గోరంట్ల మేర సీనియర్ నేతలు వేళ్ల మీద లెక్క పెట్టేంత మందే ఉన్నారు. నాలుగు పదుల ప్రస్థానానికి దగ్గరైన పార్టీలో గోరంట్ల మాదిరిగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్న నేతలు చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ క్రమంలో ఏనాడూ లేని అసంతృప్తి ఈ రోజే ఎందుకు వచ్చిందన్న దానిపై కొంతమేర స్పష్టత వచ్చిందనే చెప్పాలి. పాత తరం పోతూ ఉంటే కొత్త తరం నేతలు వస్తూనే ఉంటారు కదా. అలాగే తూర్పు గోదావరి జిల్లా.. ప్రత్యేకించి రాజమహేంద్రవరంలోనూ పార్టీలోకి కొత్త నీరు వస్తూనే ఉంది. ఈ కొత్త తరం నేతలతో బుచ్చయ్యకు కొంత మేర గ్యాప్ ఏర్పడిందన్న మాట కూడా వాస్తవమే. అయితే ఇతర నేతల మాదిరిగా కాకుండా కాస్తంత ముక్కుసూటి మనిషిగా పేరు పడ్డ గోరంట్ల.. తన మనసులో ఉన్న దేనినీ దాచుకోరు. తనకు ఏది అనిపిస్తే.. దానినే అనేస్తారు. ఈ తరహా వైఖరి కొందరికి నచ్చదు కూడా. అలాగని గోరంట్ల కూడా ఇతరులను ఇబ్బందిపెట్టే రకం కూడా కాదు. మొత్తంగా ఎక్కడో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ను పూడ్చే పనిని పార్టీ అధిష్ఠానం తక్షణమే చేపట్టింది. సమస్యను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ వెనువెంటనే రంగంలోకి దిగిపోయింది. వెరసి గోరంట్ల పార్టీని వీడే సమస్యే ఉత్పన్నం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ఆ రెండూ పోయాయి.. ఇప్పుడు ఇంకొకటి