కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు తగాదాలకు నిలయమన్న పేరుంది. దేశంలోని అన్ని పార్టీల కంటే వయసులో పెద్దదైన ఈ పార్టీలో ఆది నుంచి కూడా గ్రూపు తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ నేతలను ఏకతాటిపై నడపగలిగిన నేతల చేతుల్లో బాధ్యతలున్నా కూడా ఈ తగాదాలకు అడ్డు పడలేదు. ఇక అంతంతమాత్రంగా పార్టీ పట్టున్న నేతలుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతకుమించి ఇతర పార్టీల్లో నుంచి పార్టీలోకి వచ్చిన నేతలకు సారథ్య బాధ్యతలు దఖలు పడితే.. అప్పుడు పార్టీలోని నేతలకు ఏ మేర మంట ఉంటుందో వివరించాల్సిన పనే లేదు. ఆ వలస నేత సత్తా కలిగిన నేత అయినప్పటికీ.. ఆ నేత అదుపాజ్ఞల్లో నడిచేందుకు పార్టీ నేతలు అంతగా ఇష్టపడరనే చెప్పాలి. ఇప్పుడు అదే తరహా పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ లో చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఎంపిక కాకుండా ఆ పదవిని తన ఖాతాలోనే వేసుకోవాలని చివరి దాకా యత్నించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆ దిశగా విఫలమయ్యారు. అంతేనా.. తాను ఎవరి ఎంపికను అడ్డుకోవాలని యత్నించానో.. ఇప్పుడు ఆ నేత కిందనే పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్న బాధ కూడా కోమటిరెడ్డిని నిలువనీయడం లేదనే చెప్పాలి. మొత్తంగా ఏమాత్రం అవకాశం చిక్కినా.. రేవంతుడిపై కోమటిరెడ్డి విరుచుకుపడుతూనే ఉన్నారు.
ఇంద్రవెల్లి సభకు రాలేదే
రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఇల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత, గిరిజన దండోరా గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సభ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఏ మేర ఉత్సాహం నింపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పార్టీ నేతల్లో కీలక వ్యక్తులంతా ఈ సభకు హాజరైనా కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం ఇంద్రవెల్లి దరిదాపుల్లోనే కనిపించలేదు. వెంకటరెడ్డితో పాటు ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ సభకు హాజరుకాకపోవడం గమనార్హం. ఓ వైపు టీఆర్ఎస్ సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్న కోమటిరెడ్డి.. రేవంత్ నేతృత్వంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సభలకు మాత్రం రావడం లేదు. వాస్తవానికి ఈ సభకు కోమటిరెడ్డి బ్రదర్స్ గనుక హాజరై ఉండి ఉంటే.. సభ మరింతగా సక్సెస్ అయ్యేది. పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా కదిలేవారు. ప్రత్యర్థి పార్టీల్లో మరింత మేర వణుకు మొదలయ్యేదే.
ఇప్పుడు పిలవలేదని ఫిర్యాదు
ఇంద్రవెల్లి సభ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో.. అదే ఊపుతో ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలోనూ ఇదే పేరుతో ఓ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో తమకు మాట మాత్రమైనా చెప్పలేదని పేర్కొంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారట. అసలు తాము పార్టీలోనే కదా ఉన్నది.. మా ఫ్యామిలీ నుంచే ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని, అలాంటి మా ఫ్యామిలీకి సమాచారం ఇవ్వకుండా పార్టీ సభలు, సమావేశాలను ఎలా నిర్వహిస్తారని కోమటిరెడ్డి ఈ సందర్భంగా అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. ఈ ఫిర్యాదు మాట నిజమేనని ఒప్పుకున్నట్లుగా.. తానేమీ రేవంత్ కు ఫోన్ చేయలేదని, ఇబ్రహీంపట్నం సభను వాయిదా వేయాలని కోరలేదని చెప్పిన కోమటిరెడ్డి.. అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన విషయంపై మాత్రం స్పందించేందుకు నిరాకరించారు. ఈ తరహా వైఖరితో కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాలను మరోమారు బయటపెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- కోమటిరెడ్డి రెడీ.. కేసీఆర్‌దే ఆలస్యం