నిజమే.. ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) పేరు అంటే ఎలా ఇష్టం లేదో.. అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు కూడా కాంగ్రెస్ నేతల పేర్లు అన్నా పడటం లేదు. వెరసి ఏపీలో ఆయా పథకాల ముందు ఉన్న ఎన్టీఆర్ పేరును తీసేస్తుంటే.. అక్కడ మోదీ సర్కారు కేంద్ర పథకాల ముందు ఉన్న కాంగ్రెస్ నేతల పేర్లను తొలగిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.ప. క్రీడాకారులకు ఇచ్చే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మారుస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. అవార్డు పేరులోని రాజీవ్ అన్న పేరును తొలగించేసి.. దాని స్థానంలో మేజర్ ధ్యాన్ చంద్ పేరును చేరుస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మోదీ ఓ ట్వీట్ చేశారు.
ఇకపై ధ్యాన్ చంద్ ఖేల్ రత్న
క్రీడల్లో తమదైన ప్రతిభ చూపుతున్న క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల అవార్డులను ఇస్తోంది. వీటిలో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ప్రధానమైనది. దీనితో పాటు అర్జున అవార్డు, ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారం, ద్రోణాచార్య అవార్డులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదాని జోలికి పోని మోదీ సర్కారు.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరును కలిగిన రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరును మాత్రమే మార్చుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. మారిస్తే అన్ని అవార్డుల పేర్లను మారిస్తే.. విమర్శలేవీ వచ్చేవి కాదు. అలా కాకుండా అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ అవార్డుల పేర్లను అలాగే ఉంచేసి.. కేవలం రాజీవ్ గాంధీ పేరు కలిగిన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుల పేరును మాత్రమే మార్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతలన్నా.. ఆ పార్టీకి చెందిన మాజీ ప్రధానుల పేర్లు అన్నా వ్యతిరేకత చూపుతున్న మోదీ సర్కారు.. వారి పేర్లు కనిపించకుండా చేస్తున్న క్రమంలోనే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మార్చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ దీ అదే బాట కదా
ఇదిలా ఉంటే.. మోదీ సర్కారు కంటే ముందుగానే ఏపీలోని జగన్ సర్కారు ఎన్టీఆర్ పేరిట కొనసాగుతున్న పథకాలతో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేరిట ఉన్న పథకాల పేర్లను మార్చచేస్తోంది. ఎన్టీఆర్ పేరిట కొనసాగుతున్న అన్న క్యాంటీన్లను అధికారంలోకి వచ్చినంతనే జగన్ సర్కారుఉ ఏకంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చంద్రబాబు పేరిట ఉన్న చంద్రన్న బీమాను కూడా వైఎస్సార్ బీమాగా మార్చిన జగన్.. కొత్తగా ప్రవేశపెడుతున్న అన్ని పథకాలకు తన తండ్రి వైఎస్సార్ పేరునో, లేదంటే తన పేరుతోనే మొదలుపెట్టేస్తున్నారు. ఈ తరహా రాజకీయాల వల్ల మంచి పథకాలను సైతం జనం మరిచిపోయే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక సారి ఓ పథకం ప్రారంభమైతే.. ఆ పథకాన్ని అలాగే కొనసాగించడంతో పాటుగా దాని పేరును కూడా మార్చరాని విధంగా చట్టం చేస్తే తప్పించి ఈ తరహా చర్యలు ఆగవన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ఓటమి దిశగా వైసీపీ.. తేల్చేసిన జగన్ సర్వే











