విశాఖ కాపులుప్పాడలో ప్రభుత్వం 30 ఎకరాల్లో చేపట్టిన నిర్మాణాలకు అతిథి భవనాలు అని పేరు పెట్టింది. కానీ.. ఇవే విశాఖ రాజధాని కి కీలక పరిపాలన భవనాలు అవుతాయని.. ప్రస్తుతం కోర్టు ఇబ్బందులు లేకుండా.. అతిథి భవనాలనే పేరుతో నిర్మిస్తున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే, అలాంటి ప్రచారాలను నమ్మాలనిపించేలా.. కాపులుప్పాడలో అతిథి భవనాలకోసం కేటాయించిన.. 30 ఎకరాల్లో ఒక్క చెట్టును కూడా నరకడానికి వీల్లేదని హైకోర్టు తాజాగా ఆదేశించింది. ఆ ప్రాంతంలో మొదలెట్టబోతున్న నిర్మాణాల ప్రయత్నాలకు ఇది బ్రేక్ అనుకోవాలి…
హైకోర్టు కీలక ఆదేశాలు
విశాఖ కాపులుప్పాడ కొండపై గ్రేహ్యాండ్స్ దళాలకు చెందిన 30 ఎకరాల్లో అతిథిగృహం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ అమరావతి రాజధాని ఐకాస నేత గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటిషల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ 30 ఎకరాల్లో ఒక్క చెట్టూ నరకడానికి వీల్లేదని ఆదేశించింది. గ్రేహ్యాండ్స్ దళాలకు ఇచ్చిన భూమిలో అతిథి గృహ నిర్మాణం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం అతిథిగృహానికి కేటాయించిన 30 ఎకరాల్లో చెట్లు నరకవద్దని ఆదేశించింది. అంటే అక్కడ నిర్మాణాలు ఆగిపోయినట్టే భావించాల్సి ఉంటుంది. అతిథిగృహం నిర్మాణం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Must Read ;- విశాఖ విమానాశ్రయానికి ఎసరు!
విశాఖ రాజధానిలో మొదటి నిర్మాణానికి బ్రేక్
మూడు రాజధానులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం విశాఖను పాలనా రాజధానిగా చేయాలని భావించింది. ఇందులో భాగంగా విశాఖలో అతిథిగృహం పేరుతో 30 ఎకరాల్లో భారీ నిర్మాణాలు చేపట్టింది. రాజధానిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. కాబట్టి విశాఖలో రాజధాని కోసం నిర్మాణాలు చేస్తున్నామని చెప్పుకునే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది. అయితే అతిథిగృహం పేరుతో విశాఖ కాపులుప్పాడ గ్రేహ్యాండ్స్ కు కేటాయించిన స్థలంలో పాలనాభవానాలను నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అతిథిగృహమని చెబుతున్నా, అక్కడ పాలనారాజధానికి కావాల్సిన భవానాలు నిర్మిస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయి. అయితే గ్రేహ్యాండ్స్ కు కేటాయించిన అటవీ భూముల్లో చెట్లను కొట్టివేసి నిర్మాణాలు చేపట్టడంతో అమరావతి ఐకాస నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన ధర్మాసనం చెట్లను నరికివేయవద్దని ఆదేశించింది. అంటే విశాఖలో ప్రభుత్వం చేపట్టిని అతిథిగృహ నిర్మాణాలు ఆగిపోయాయని భావించాల్సి ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read ;- విశాఖ కూల్చివేతల్లో ఈ వీకెండ్ టార్గెట్ ఎవరు?











