అందాల రాక్షసి చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమై ..అందరి నోటా అందాల సుందరిగా పిలవబడుతున్న లావణ్య త్రిపాఠి చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. గ్లామర్ పాత్రలు చేయనంటే చేయను..నటనకు అవకాశం ఉన్న పాత్రలకే నా ఆమోదం అని కెరీర్ మొదట్లో చెప్పుకొచ్చిన ఆమె కేవలం రెండు సినిమాల వరకే ఆ నియమాన్ని అనుసరించింది. ఆ తర్వాత అవకాశాలకు గండి పడుతుందనో? ఏమో తెలియదు కానీ చాలా మంది హీరోయిన్ల కోవలోనే గ్లామర్ పాత్రలకు జై కొట్టేసింది.
ఈ నేపథ్యంలో నాని సరసన ఆమె నటించిన `భలే భలే మగాడివోయ్` బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాని తర్వాత నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. అది కూడా బాక్సాఫీస్ వద్ద గణ విజయం సాధించింది. దాంతో ఇక వరుస అవకాశాలు లావణ్య దరి చేరాయి. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నాగచైతన్య, శర్వానంద్, అల్లు శిరీష్ వంటి హీరోల సరసన నటించే అవకాశం ఆమెకు లభించింది.
అయితే అంతవరకు బాగానే ఉంది కానీ వారి సరసన నటించిన `శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్, రాధ, యుద్ధంశరణం, అంతరిక్షం 9000, అర్జున్ సురవరం వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. దాంతో ఇప్పడు ఆమెకు హిట్ అత్యంత ఆవశ్యకమైంది. తన చేతిలో ఉన్న రెండు సినిమాలు తప్పకుండా తనకు విజయాన్ని అందించేవేనని ఆమె ఎన్నో ఆశలతో ఎదురుచూస్తోంది. ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన నటించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం `ఎ 1 ఎక్స్ ప్రెస్’, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న `చావు కబురు చల్లగా’ చిత్రంలోను ఆమె నటించింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి.. వీటితో లావణ్య విజయాలను తన ఖాతాలో వేసుకుంటుందో? లేదో? తెలియాలంటే ఆ సినిమాల విడుదలవరకు ఆగాల్సిందే.
Nust Read ;- జోరు పెంచుతున్న ‘గ్యాంగ్ లీడర్’ బ్యూటీ.. !











