డ్రగ్స్ కేసు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైనట్టే ఉంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ ప్రముఖుల్లో డ్రగ్స్ కేసు గుబులు పుట్టించింది. తాజాగా అర్జున్ రాంపాల్ ఈ కేసులో ఇరుక్కునే వాతావరణం కనిపిస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఆరు గంటలకు పైగా అర్జున్ రాంపాల్ ను ప్రశ్నించింది. ఈ వారం అతని నివాసంపై ఎన్సీబీ దాడి చేసి కొన్ని మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకుంది.
ఇవన్నీ తన ప్రిస్క్రిప్షన్‌లో భాగమని అర్జున్ రాంపాల్ స్పష్టంచేశాడు. ‘నేను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నా. నాకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం’ అని వివరించారు. రాంపాల్ ఇంటిని సోమవారం అధికారులు శోధించారు. ఆ తర్వాత సమన్లు జారీ చేశారు. అతని స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌ను బుధవారం, గురువారం దాదాపు ఆరు గంటలపాటు ప్రశ్నించారు. డ్రగ్స్ లింకుపై ఆమె సోదరుడు అగిసియలోస్ డెమెట్రియేడ్స్‌ను రెండుసార్లు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎన్సీబీ అదుపులో ఉన్న దక్షిణాఫ్రికా జాతీయుడు అగిసియోలోస్ డెమెట్రియేడ్స్‌ను ప్రశ్నించిన తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన పాల్ బార్టెల్‌ను కూడా ఎన్‌సిబి అరెస్టు చేసింది.
ముంబైలో అరెస్టయిన మిస్టర్ బార్టెల్‌ను ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారు. సోమవారం చిత్ర నిర్మాత ఫిరోజ్ నాడియాడ్ వాలాను ఎన్‌సిబి పిలిపించింది. ముంబయిలోని జుహులోని ఆయన ఇంటి వద్ద 10 గ్రాముల గంజాయిని కనుగొన్నారు. అంతకుముందు రోజు అతని భార్య షబానా సయీద్‌ను కూడా అరెస్టు చేశారు. డ్రగ్స్ పెడ్లర్ వాహిద్ అబ్దుల్ కదిర్ షేక్‌ను ఆమధ్య అంధేరిలో అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఫిరోజ్ ఇంట్లో వెతికారు. మొత్తం మీద బాలీవుడ్ డ్రగ్స్ లింకులన్నీ ఒక్కొటొక్కటిగా బయటపడుతున్నాయి.