ఈ మధ్య కాలంలో సరైన ప్రేమకథ తెలుగు తెరను పలకరించలేదనే చెప్పాలి. కథలో ప్రేమ ఉండటం వేరు .. ఆ ప్రేమలో ఫీల్ ఉండటం వేరు. ఇవన్నీ ఉన్నప్పుడే ప్రేమకథ పండుతుంది .. మనసు పాత్రల్లో నిండుతుంది. అలాంటి ప్రేమకథను ‘ఉప్పెన‘ పేరుతో బుచ్చిబాబు అందించాడు. వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టి నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ సెంటర్లు .. క్లాస్ సెంటర్లు అనేది లేకుండా ఈ సినిమా బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతోంది. రోజు రోజుకి ఈ సినిమా ఆదరణ పెరుగుతూ పోతుండటం విశేషం.
ఏ కథలోనైనా కొన్ని లోపాలు ఉంటూనే ఉంటాయి. వాటన్నింటిని వెతుక్కుంటూ కూర్చోకుండా ఒక సాధారణ ప్రేక్షకుడిలా చూస్తే ఈ సినిమా బాగానే అనిపిస్తుంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చేసిందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఆ ఆనందంతో .. ఉత్సాహంతో సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. 17వ తేదీ (బుధవారం) సాయంత్రం రాజమండ్రి – మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్ నందు ఈ వేడుకను జరపడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిని ఆహ్వానించిన దర్శక నిర్మాతలు, సక్సెస్ సెలబ్రేషన్స్ కి చరణ్ ను ఆహ్వానించారు. దాంతో సహజంగానే మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఈ వేడుకపై .. ఈ వేదికపై ఉండనుంది. సక్సెస్ సెలబ్రేషన్స్ కి మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో .. తొలి సినిమాతోనే ఇంతటి ఘన విజయాన్ని సాధించడం పట్ల వాళ్లంతా ఖుషీ అవుతున్నారు.
Must Read ;- బుచ్చిబాబు ‘మెగా’ హృదయాలను అంతలా కోసేశాడా?











