హుజూర్‌నగర్ పోయింది.. దుబ్బాక పోయింది.. GHMC పోయింది.. అప్పుడెప్పటి నుంచో మార్చుతామని చెప్పారు.. మొన్నటి వరకు జాతీయ స్థాయి నుంచి ఒకడు వచ్చారు..పార్టీని మరింత ముంచి పోయారు..ఈలోగా జరగాల్సిన నష్టం జరిగింది. ఏ వర్గానికి అనేది కాదు..పార్టీని కొద్దోగొప్పో ముందుకు తీసుకెళ్లేవారు నాయకత్వం వహిస్తారనుకుంటే.. అంతర్గత కుమ్ములాటలు పెరిగి పోతున్నాయి. ఈలోపు పార్టీ మారే వారు కొందరున్నారు. పోయేవాళ్లు పోతారు..పదవుల కోసమే పార్టీలో ఉండేవాళ్లు కాదు మాకు కావాల్సింది.. పార్టీని రాజ్యాధికారంవైపు తీసుకెళ్లేవాడు కావాలి..కాని ఈ చర్చలు..రాజకీయాలేంటో అర్థం కావట్లేదు.. ఇన్నాళ్లు ఏం చేశారో తెలియదు.. ఇప్పుడు అభిప్రాయ సేకరణ ఏంటి.. ఈ లోగా నాయకుల మధ్య రచ్చ నడుస్తోంది. పార్టీ పరువు బజారును పడుతోంది. మిగతా పార్టీల వాళ్లు మిమ్మల్మి సూచి..మీ పార్టీ అంతేలే..కానివ్వండి అంటే ఎలా ఉంటుంది..
సోషల్ మీడియాలో ఓ కార్యకర్త పోస్ట్ ఇలా..
అంటే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్న అభిప్రాయానికి ఈ పోస్ట్ అద్దం పడుతోందని చెప్పవచ్చు. తెలంగాణ కొత్త పీపీసీ విషయంలో జరుగుతున్న తాత్సారం ఆ పార్టీనే ముంచుతోందని చెప్పవచ్చు.చాలా రోజుల నుంచి ఈ విషయంపై చర్చ నడుస్తున్నా.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్కం ఠాగూర్ కొన్ని రోజులుగా కోర్ కమిటీ నేతలతో భేటీ అయ్యారు. అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. 25మంది లీడర్లతో సమావేశమయ్యారు. ఆదివారం వరకు ఈ అభిప్రాయ సేకరణ ఉంటుంది. తరువాత పార్టీ జనరల్ సెక్రటరీకి నివేదిక ఇస్తారు. తరువాతే టీపీసీసీపై నిర్ణయం ఉంటుంది. కొత్తగా వచ్చే అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు వెళ్లాల్సి ఉంటున్న నేపథ్యంలో పార్టీ చాలా ఆలోచించి అడుగులు వేస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు.
కులం, ప్రాంతం, అనుభవం..
ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. పొన్నాల తరువాత బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ హయాంలో పార్టీ ప్రతికూల ఫలితాలే ఎక్కువగా సాధించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మరోసారి రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వాలా.. లేక ఓసీల్లోనే మరో వర్గానికి ఇవ్వడం, బీసీ, ఎస్సీ వర్గాలవారికి ఇవ్వడమా అనే అంశంపైనా చర్చ నడుస్తోంది. ఈ కోణంలోనూ ఠాగూర్ ప్రతి సామాజిక వర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు నేతల పేర్లతో నివేదిక సమర్పించనున్నారని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వర్గానికి చెందినవారైనా సరే..పార్టీని గట్టెక్కించేవారు కావాలనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
ఎన్నో కార్డులు..
గతంలో సీఎల్పీ లీడర్‌గా జానా రెడ్డి ఉన్నారు. పొన్నాల పీసీసీగా ఉన్నారు. ప్రస్తుతం ఉత్తమ్ పీసీసీగా ఉండగా మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. రెడ్డి వర్గానికి ఏదో ఒక పదవి ఉండడం కామన్‌గా మారిందని, బీసీలకు స్థానం కల్పించాలని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన హయాంలోనే దుబ్బాక, GHMC లో ఎక్కువ సీట్లు గెలిచారని గుర్తు చేస్తున్నారు. టీఆర్ఎస్‌ను, బీజేపీని ఢీకొట్టాలంటే.. బీసీకే పదవి ఇవ్వాలని కొందరు, పార్టీ విధేయులకే ఇవ్వాలని కొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 150 మంది ఈ పదవికి పోటీ పడుతున్నట్లు మాణిక్కం ఠాగూర్ మీడియాకు చెప్పారంటే…పోటీ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏ వర్గం నుంచి ఎవరు?
రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, జగ్గారెడ్డి ఉన్నారు. పీసీసీ చీఫ్ పోస్టు పట్ల తమకు అంతగా ఆసక్తి లేదని జానారెడ్డి, జీవన్ రెడ్డిలు పార్టీ నేతలతో బయటకు చెప్తున్నా.. హైకమాండ్ ఎంపిక చేస్తే మాత్రం అభ్యంతరమేమీలేదని అంటున్నట్టు తెలిసింది. ఇక దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేరు కూడా వినిపిస్తోంది. బ్యాలెన్సింగ్ నేతగా ఆయనకు పేరుంది. మరో వర్గం నుంచి పొన్నం, వీహెచ్, అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కీ, పొన్నాల తదితరుల పేర్లు ఉన్నాయి. సీనియర్ లీడర్లైన భట్టి, రాజనర్సింహ, సంపత్‌కుమార్‌లు కూడ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: కార్యకర్తలలో ధైర్యాన్ని నింపిన రేవంత్ రెడ్డి