ఈ గ్రాఫిక్ యుగంలో సాధారణ సినిమాలు చేయడం కంటే గ్రాఫిక్ మాయాజాలంతో పాన్ ఇండియా సినిమాలు చేయడం ఉత్తమం అనే అభిప్రాయానికి చాలామంది దర్శకులు వచ్చేస్తున్నారు. మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇప్పుడు అటువైపే దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఆ మధ్య అల్లు అరవింద్ రామాయణం సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కొంతకాలంగా అటకెక్కింది. ఇప్పుడు దీని దుమ్ము దులిపే ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ రామాయణం పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దృష్టి సారించినట్టు సమాచారం. ఇది కార్యరూపం దాల్చితే మన పౌరాణిక గాథలెన్నో మళ్లీ తెరమీదకు రావడానికి అవకాశం కలుగుతుంది. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో తీసిన మాయాబజార్, నర్తన శాల లాంటి చిత్రాలు ఇప్పటికీ ఆణిముత్యాలుగా నిలిచాయి. రాబోయే కాలంలో విజువల్ ఎఫెక్ట్ తో మన పాతచిత్రాలు మరిన్ని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి త్రివిక్రమ్ ‘రామాయణం’లో ఎవరు నటిస్తారన్న ఆసక్తి సహజం. ఇంకెవరు ఇలాంటి పాత్ర చేయాలంటే అది నేటి తరంలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కే సాధ్యం.

రాముడిగా మహానటుడు ఎన్టీఆర్ ను చూసిన జనం ఆ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రమే చూడగలరు. ఆదిపురుష్ ప్రాజెక్టు కన్నా ముందే తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ఈ రామాయణం ప్రాజెక్టును తలపెట్టారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు ఉంటుదన్నారు. కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు పనులు కూడా ఆగిపోయాయి. మొత్తం రెండు భాగాలుగా ఈ రామాయణం ఉంటుంది. ప్రస్తుతం మళ్లీ ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన బాధ్యతలను త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అరవింద్ అప్పగించినట్టు తెలిసింది. ఈ సినిమాకు డైలాగ్స్ తోపాటు స్క్రీన్ ప్లే బాధ్యతలను కూడా త్రివిక్రమ్ చూస్తున్నారు.
దీనికి ఒకరే డైరెక్టర్ ఉంటారా? డైరెక్టర్ల బృందం పనిచేస్తుందా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. మరి రాముడి పాత్రకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా లేదా అన్నది కూడా చూడాలి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. మరో రెండు మూడు నెలల్లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ను ఈ ప్రాజెక్టు వైపు తిప్పుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
రాజమౌళి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారినట్టుగానే జూనియర్ కూడా అలా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ రామాయం వచ్చే వేసవి తర్వాతగాని సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు లేవు. ఈలోపు ఎన్టీఆర్ మరో సినిమా చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రామాయణం భారీ ప్రాజెక్టు కాబట్టి ఇందులో అతిరథమహారథులంతా నటించే అవకాశం ఉంది. ఈ జనవరి నుంచే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని సమాచారం.
-హేమసుందర్ పామర్తి
Also Read:టాలీవుడ్లో మళ్ళీ మొదలైన భారీ సెట్ల సందడి











