టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ పై ఓటుకు నోటుకేసు లో A4 నిందితుడిగా ఉన్న జెరూసెలం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని, ఈ కేసులో అప్రూవర్‌గా మారిన తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు తనకు రక్షణ కల్పించాలని కోరారు.
Must Read ;- ఆత్మవంచన వీడకుంటే.. అథోగతి తప్పదు రేవంత్‌రెడ్డి సార్!
తెలంగాణ ఏర్పాటయ్యాక 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలతో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహ, జెరూసలెం మత్తయ్యలపై ఏసీబీ కేసు నమోదైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్కు 50 లక్షల రూపాయల నగదును రేవంత్ రెడ్డి ఇస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇదే కేసులో రేవంత్ రెడ్డి అరెస్టై జైలుకి కూడా వెళ్లారు. ఈ కేసు విచారణ ఇంకా జరుగుతోంది.
జెరూసలం మత్తయ్య ఆరోపణల విషయం పక్కన బెడితే.. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తారన్న ప్రచారం మొదలైనప్పుడల్లా రేవంత్ పై ఏదో ఒక ఆరోపణ రావడం, వివాదాస్పద ఇష్యూని తెరపైకి తేవడం జరుగుతోంది. 2018 ఎన్నికలకు ముందు రేవంత్‌పై ఆదాయపుపన్ను శాఖ దాడులు జరిగాయి. తరువాత ఆయన సంబంధీకులపై గోపన్ పల్లి ప్రాంతంలో భూ కబ్జా ఆరోపణలతో కేసు నమోదైంది. తరువాత హుజూర్ నగర్ ఉప ఎన్నికలయ్యాక మరోసారి గోపన్ పల్లి భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ మధ్య రెవెన్యూ శాఖకు చెందిన ఓ అధికారి లంచం తీసుకుంటూ రూ.కోటిపైగా క్యాష్ తో పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఇష్యూలో రేవంత్ ఉన్నాడని కొన్ని మీడియా ఛానెల్స్ ప్రచారం చేశాయి. దీనిపై రేవంత్ ఫైర్ అయ్యారు. సదరు మీడియా సంస్థల యజమానులపై నేరుగా విమర్శలు గుప్పించారు. దమ్ముంటే ఆరోపణలు రుజువుచేయాలని సవాల్ చేశారు.
Also Read ;- కార్యకర్తలలో ధైర్యాన్ని నింపిన రేవంత్ రెడ్డి
తాజాగా టీపీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి ఆ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఆ పదవి రేసులో రేవంత్ ఉండడంతో సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది రేవంత్‌కి ఇవ్వద్దనే అభిప్రాయంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సొంతపార్టీవారే కొన్ని సార్లు రేవంత్ పై కేసుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్న చేస్తున్నారన్న చర్చ ఆ పార్టీలోనే నడుస్తోంది. ఇక గత వారం నుంచి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని మీడియా ఛానెల్స్‌లో కథనాలు రావడం, సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేయడం వెనుక ఆ పార్టీకి చెందిన వారితోపాటు మరి కొందరు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. నగరం నడిబొడ్డున ఉన్న హోటల్ కేంద్రంలో చర్చలు నడిచాయని కూడా ప్రచారం జరుగుతోంది.
కాగా తనకు పదవి ఇస్తే.. తన కార్యాచరణ ఎలా ఉంటుందనే అంశంపై రేవంత్ రెడ్డి ఇప్పటికే హైకమాండ్‌కు ఒక నివేదిక పంపినట్లు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాకూర్ కి కూడా ఇచ్చినట్టు సమాచారం. తనపై ఉన్న కేసులు, కేసుల నేపథ్యం, తదితర విషయాలను ఇప్పటికే పార్టీ హైకమాండ్ కి స్వయంగా రేవంత్ రెడ్డి పంపినట్లు తెలుస్తోంది. మొత్తంమీద రేవంత్ రెడ్డికి పార్టీలో పదవి వస్తుందని ప్రచారం జరుగుతున్న ప్రతిసారి ఏదో ఒక వివాదాస్పద అంశం తెరపైకి వస్తుండడం యాదృచ్ఛికమేనా? ఎవరిదైనా వ్యూహమా? అనే సంగతి అర్థం కావడం లేదు.
Also Read ;- అధిక ప్రచారమే రేవంత్ కొంపముంచుతోందా?