రాష్ట్ర ప్రభుత్వాలు మారినా సరే.. అదివరకటి ప్రభుత్వాలు తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనన్నది చాలా కీలకమైన విషయం. మునుపటి ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందాలను తర్వాతి ప్రభుత్వాలు రద్దు చేయడం సముచితం కాదు.. అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వపు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సూచిస్తోంది. ఈ మేరకు వారు ప్రభుత్వాలు పెట్టుబడి దారులకు హామీ ఇవ్వాలంటూ.. కుదుర్చుకోవాల్సిన ఎంవోయూ ముసాయిదాను తాజాగా అన్ని రాష్ట్రాలకు పంపారు. కొత్త నిబంధనలు రూపొందించారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారితే ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా కొత్త నిబంధనలు రక్షణ కల్పిస్తాయని ఆ సంస్థ అధికారులు చెబుతున్నారు. తాజాగా ఈ నిబంధనల రూపకల్పన- ఎంవోయూలకు కొత్త ముసాయిదా తయారైన నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలేమిటో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
పెట్టుబడులు వస్తేనే యువతకు ఉపాధి దొరుకుతుంది. రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. అందుకే పలు రాష్ట్రాలు పెట్టుబడులు ఆకర్షించేందుకు అనేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటాయి. కానీ ఏపీలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే సౌర ,పవన విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. దీంతో వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎంవోయూలు చేసుకున్న కంపెనీలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. దీంతో ఒక ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంటే మరో ప్రభుత్వం రాగానే రద్దు చేస్తారా? ఇలా చేస్తే అసలు పెట్టుబడులు వస్తాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎంవోయూల రద్దు పెట్టుబడిదారుల్లో నమ్మకంలో కోల్పోయేలా చేస్తుందని, ఇది చాలా ప్రమాదకరమని కేంద్రం సూచించింది. ప్రభుత్వాలు మారగానే కొత్తగా వచ్చే ప్రభుత్వాలు ఎంఓయూలను రద్దు చేయడం ఏమాత్రం మంచిది కాదని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం తాజాగా స్పష్టం చేసింది.
ఎవరికి నష్టం
పెట్టుబడులు తెచ్చుకోవడమే చాలా కష్టం. రాష్ట్రాల మధ్య ఎంతో పోటీ ఉంది. ఏ రాష్ట్రంలో రాయితీలు ఎక్కువగా ఇస్తున్నారో పరిశీలించుకుని పెట్టుబడిదారులు అక్కడి ప్రభుత్వాలతో ఎంవోయూలు చేసుకుంటూ ఉంటారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సౌర, పవన్ విద్యుత్ కంపెనీలు బారులు తీరాయి. ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్నాయి. కొన్ని కంపెనీలయితే విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సౌర పవన విద్యుత్ ధరలు అధికంగా ఉన్నాయని విద్యుత్ కొనుగోళ్లు నిలిపివేసింది. కొన్ని ప్రాజెక్టుల ఎంవోయూలు రద్దు చేసింది. దీంతో ఆయా కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడ వారికి అనుకూల తీర్పు రావడంతో ఏపీ ప్రభుత్వం సౌర, పవన్ విద్యుత్ కొనుగోళ్లు ప్రారంభించింది.
అయితే ఇంకా పనులు ప్రారంభించని సౌర, పవన విద్యుత్ కంపెనీల ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. దీంతో వారు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు పోయింది. ఒకసారి ఎంవోయూ కుదిరింది అంటే, ఏ ప్రభుత్వం వచ్చినా తప్పనిసరిగా ఎంవోయూకు కట్టుబడి ఉండాల్సిందే. వేల కోట్లు అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులు పెడితే మధ్యలోనే రద్దు చేసుకుంటే అప్పటిదాకా పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసుకున్న ప్రభుత్వాలు మారినా ఎంవోయూలు రద్దు చేసుకోవద్దని స్పష్టం చేసింది.
Must Read ;- దర్శిలో చొక్కాలు చించుకుని కొట్టుకున్న వైసీపీ నేతలు
ఏపీలో రద్దయిన ఎంవోయూలు ఎన్నో?
- లులూ గ్రూపు రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గత ప్రభుత్వంలో ఎంవోయూ చేసుకుంది. ప్రభుత్వం మారగానే ఎంవోయూ రద్దు చేసుకున్నారు.
- అదానీ డేటా సెంటర్ తో గత ప్రభుత్వం చేసుకున్న రూ.30 వేల కోట్ల విలువైన ఎంవోయూలు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసుకుంది.
- రేణిగుంట ఎఈజడ్ లో రిలయన్స్ జియోతో సహా అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు చేసుకున్న ఒప్పందాలు రద్దయిపోయాయి.
- అమర్ రాజా బ్యాటరీ కంపెనీ విస్తరణకు గత ప్రభుత్వం ఇచ్చిన భూములు వెనక్కు తీసుకోవడం ద్వారా పెట్టుబడులు నిలిచిపోయాయి. ఇలా అనేక కంపెనీలు ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే పెట్టుబడులు నిలిపివేశాయి.
- సింగపూర్ కన్సార్డియం రద్దు. రాజధాని అమరావతి విషయంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి గత ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్న సింగపూర్ కన్సార్డియం రద్దయిపోయింది.
- రాజధాని మూడు ముక్కల ప్రకటనతో వేల కోట్ల పెట్టుబడులు నిలిచిపోయాయి. అనేక దేశాల్లో రాష్ట్రం పరువు పోయింది. విదేశాల నుంచి స్వదేశం నుంచి కానీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంటే తరవాత మరో ప్రభుత్వం వస్తే ఎంవోయూలు రద్దయిపోతాయనే భయంతోనే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
వైసీపీ ప్రభుత్వంలో రద్దయిన ఎంవోయూలు
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.4.68 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 331 ఎంవోయూలు చేసుకున్నారు. ఇక 2017లో 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 664 ఎంవోయూలు జరిగాయి. 2018లో 15 లక్షల కోట్ల విలువైన 1817 ఎంవోయూలు కుదిరాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎంవోయూలు అన్నీ రద్దయి పోయాయి. పెట్టబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికితోడు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే నిబంధన పెట్టడంతో చాలా కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి.
Also Read ;- పంటల బీమాపై దిగొచ్చిన ప్రభుత్వం.. టీడీపీ వ్యూహంతో వైసీపీ కలవరం