వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది నిజం. ప్రభుత్వ సమ్మతి లేనిదే ఎన్నికల సంఘం తేదీలను నిర్ణయించే హక్కు ఉండకూడదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. బహుశా ఇలాంటి వింతలు ఏపీలో మాత్రమే చోటు చేసుకుంటాయి. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్ధ అని అందరికీ తెలుసు. అటువంటి సంస్ధతో సమన్వయం కలిగి నడుచుకోవడం ప్రభుత్వ బాధ్యత. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల కమిషన్ తో గిల్లికజ్జాలు పెట్టుకుని, కోర్టులలో కొట్టుకుంటూ చివరికి అసెంబ్లీలో దాని కోసం ప్రత్యేక తీర్మానం చేసేంతగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును చూసి కొందరు నవ్వుకుంటుంటే, మరి కొందరు ఈ వింతలేమిటో అనుకుంటున్నారు.
కరోనా పొంచి ఉంది
కరోనా మంచి వేవ్ లో ఉన్న సమయంలో ఎన్నికలు పెట్టాలంటూ నానా యాగి చేసిన ఏపీ ప్రభుత్వం, కరోనా దాదాపు అదుపులోకి వచ్చిన సమయంలో మాత్రం, ‘అమ్మో కరోనా’ అంటూ ప్రభుత్వం చేస్తున్న చర్యలు చూస్తుంటే ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది కరోనాను సాకుగా చూపుతున్నారని. అంతటి ఆగకుండా ఎన్నికల సంఘంపై సిఐడి కేసలు, నిధుల నిలిపివేత అంటూ ఏవేవో చర్యలతో ఎలక్షన్ కమిషన్ ని ఇబ్బందులకు గురిచేయడానికి ప్రయత్నంచింది. చివరకి కోర్టులో మొటిక్కాయలు తప్పలేదు.
ఆ తర్వాతైన మారిందా అంటే లేదనే చెప్పాలి. ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండచ్చు అని చూచాయిగా చెప్పిన మాటను పట్టుకుని ఏపీ సీఎస్ ఉత్తర ప్రత్యుత్తరాలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. దీనిపై కోర్టును ఆశ్రయించినా లాభం కనిపించకపోవడంతో అంతకు మించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుంది. దానికి అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుంది.
Also Read ;- మంత్రుల తిట్లపై.. మళ్లీ గవర్నరు చెంతకు నిమ్మగడ్డ..
మా సమ్మతి అవసరం
ప్రభుత్వ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరికి అసెంబ్లీ తీర్మానాన్ని ఎంచుకుంది జగన్ ప్రభుత్వం. ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని ప్రభుత్వ తీర్మానంలో పేర్కోంది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలంగా లేవని, ఎన్నికల కమిషన్ వ్యక్తిగతంగా భావించి పంతానికి ఈ ఎన్నికలు నిర్వహించాలని పట్టుదల ప్రదర్శిస్తుందని తీర్మానంలో తెలియజేశారు. అంతేకాదు, ఎన్నికల నిర్వహణ, తేదీల ఖరారు ప్రభుత్వ అనుమతి, సమ్మతి ఉండేలా చట్టంలో మార్పులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టి, ఏకగ్రీవ ఆమోదాన్ని పొందింది.
ఎందుకింత పంతం?
జరుగుతున్న విషయాలు చూస్తుంటే పంతానికి ఎవరు పోతున్నారో, పట్టుదలగా ఎవరు ఉన్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. తాము కావాలి అనుకున్నప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జరపలేదనే కోపంతో, నిమ్మగడ్డ పదవి కాలం ముగిసేంత వరకు ఎలాగైనా ఎన్నికలు జరగనివ్వకుండా చేసి తమ పంతం నెగ్గించుకోవడమే ప్రభుత్వ ప్రయత్నమని ప్రజలకు అర్ధం కాదని అనుకుంటే ప్రభుత్వం పొరబడనట్టే. అందులో భాగంగా ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి తమ చేతిలో ఉన్న అసెంబ్లీని ఆశ్రయించినట్టుంది ప్రభుత్వం. ఎన్నికల కమిషన్ ను ఎలాగైనా ఆపాలనే పంతంతో చివరికి అసెంబ్లీ తీర్మానం లాంటి తీవ్రమైన చర్యలు చూస్తుంటే ప్రభుత్వం తనకి తానే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు కారణమవుతుందా అనిపిస్తుంది.
Must Read ;- ఫిబ్రవరి ఎన్నికలకు జగన్ దళానికి భయమెందుకు?