(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన కోదండరాముని స్థానంలో నూతన విగ్రహాల ఏర్పాటుకు దేవదాయ శాఖ అధికారులు టీటీడీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీ శిల్ప ఉత్పత్తి కేంద్రంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహాలను శిల్పులు తయారు చేశారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు విగ్రహాలను పీఠంతో కలిపి వేర్వేరుగా కృష్ణశిల రాతితో వీటిని మలిచారు. రామతీర్థంలో కోదండరాముని విగ్రహం పునః ప్రతిష్ఠకు ఇటీవల శ్రీకారం చుట్టారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ఠ పనులు ముమ్మరం చేశారు. విగ్రహాల పునః ప్రతిష్ఠకు ముందు చేపట్టాల్సిన పనులు ప్రారంభించేందుకు దేవదాయ శాఖ అధికారులు ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. హోమం పూర్తైన తర్వాత సాంప్రదాయ బద్ధంగా ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠిస్తారు. ఆలయ ఆధునికీకరణలో భాగంగా గర్భాలయాన్ని కదిలించకూడదని అధికారులు భావిస్తున్నారు. పురాతన కాలంలో నిర్మించినా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటంతో గర్భాలయ గోడలను అలానే ఉంచుతూ లోపలి భాగాన్ని మాత్రమే పూర్తిగా ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయంలో గర్భాలయం ముందు భాగాన ఉన్న మండపం, భక్తులు ప్రదక్షిణలు చేసే ప్రాకారాలను పూర్తిస్థాయిలో పునర్నిర్మించనున్నారు. కొండపై జరిగే అభివృద్ధి పనులకు సరిపడా నీరు అందుబాటులో ఉంచేందుకు దేవాదాయశాఖ యుద్ధప్రాతిపదికన వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆలయంతో పాటు రామతీర్థం కొండ మెట్ల మార్గాన్ని కూడా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భక్తులు కొండపైకి సులభంగా చేరుకునేందుకు మెట్ల మార్గాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక కొండపైనున్న ఆలయానికి ఆనుకుని ఉన్న కోనేరును కూడా పూర్తి స్థాయిలో ఆధునికీకరించనున్నారు.
అధికారులకు అప్పగింత
రామతీర్థం ఆలయంలో ప్రతిష్ఠించేందుకై శ్రీరామచంద్రుడి మూలవిరాట్‌తో పాటు సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను రూపొందించిన టీటీడీ శిల్పులు శుక్రవారం విజయనగరం దేవాదాయశాఖ అధికారులకు అప్పగించనున్నారు. రామతీర్థం ఆలయ ఆధునికీకరణ, నూతన విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాల పర్యవేక్షణకు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. విగ్రహా ప్రతిష్ట, ఆలయ నిర్మాణం, ఆగమశాస్త్రం ప్రకారం జరగాల్సిన పనులను దేవాదాయశాఖ తన ఆధ్వర్యంలో లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
Must Read ;- సింహాచల క్షేత్ర ప్రాంగణంలో మద్యం సీసాలు, సిగరెట్లు..











