ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఏపీలో బీజేపీ పరిస్థితి. రాష్ట్రం నుంచి పార్టీకి ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. క్రియాశీలకంగా పని చేసే నాయకుడూ లేడు. నాలుగు ఓట్లు రావాలన్నా జనసేన భజన చేయాల్సిందే. మరో మూడేళ్ల వరకు ఎన్నికలూ లేవు. ఇలాంటి స్థితిలో ఏకంగా అధికారం వస్తే ఏం చేస్తామో చెప్పేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు వింటే.. ఎవరికైనా ఇదే అనిపిస్తుంది.
బీసీనీ ముఖ్యమంత్రిని చేస్తాం..
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి తీరతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. కుటుంబ పార్టీలైన వైసీపీ, టీడీపీ అలా చేయగలవా అని సవాల్ విసిరారు. గురువారం విజయవాడలో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ వర్గీయులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రం దిశ దశ మార్చాలంటే కుటుంబ పార్టీలే అడ్డంకిగా మారాయని, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా చేసిన వైఎస్, చంద్రబాబు.. ప్రస్తుతం ఏపీలో ఉన్న 13 జిల్లాల అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. పోలవరం గురించి మాట్లాడేందుకు ఈ రెండు పార్టీలకు అర్హత లేదని, కిషన్‌రెడ్డి కృషి వల్లే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా దుమ్ముగూడేన్ని తెలంగాణకు ఇచ్చినా వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ మాట్లాడలేదని, దాని ఫలితంగానే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. టీడీపీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. ‘అచ్చెన్నాయుడు హోం మంత్రి అవుతానంటున్నారు.. చంద్రబాబు ఇంటికా’ అని ఎద్దేవా చేశారు.
హైకోర్టు తరలింపు కేంద్రం పనికాదు!
అమరావతిలో ఉన్న రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉండబోదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌తో దేశానికి జరిగే మేలు గురించి శని, ఆదివారాల్లో కేంద్ర మంత్రులు దేశవ్యాప్తంగా ప్రజలకు వివరిస్తారని చెప్పారు. విదేశాంగ మంత్రి జయశంకర్ శనివారం విజయవాడకు వచ్చి బడ్జెట్ గురించి తెలియజేస్తారన్నారు.
ఆగ్రహిస్తున్న జనసేన..
సీఎంపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు విని జనసైనికులు ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్‌ని సీఎం చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన అభిమానులకు ఈ మాటలు షాకిచ్చాయి. బీజేపీతో కలిసి పోటీ చేసి సీఎం అయిపోవాలనుకున్న పవన్ ఆశలు ఇకపై కేవలం అడి ఆశలని తెలుస్తున్నాయి. మరి సోము వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Must Read ;- బీజేపీకి బీపీ తెప్పిస్తున్న సోము వీర్రాజు వైఖరి