టాలీవుడ్ నటి కరాటే కల్యాణి అనూహ్యంగా భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినీ నటిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న కల్యాణి.. ఆదివారం నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న కల్యాణి.. తన వెంట మరికొందరు సినీ నటులను కూడా ఆమె బీజేపీలోకి చేర్పించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తో పాటు పార్టీకి చెందిన సీనియర్ నేత, సినీ రంగం నుంచే వచ్చిన విజయశాంతి కూడా పాల్గొన్నారు. కల్యాణిని పార్టీలో చేర్చుకున్న సందర్భంగా విజయశాంతి కీలక ప్రసంగం చేశారు.
రాములమ్మ ఏమన్నారంటే..?
ఈ సందర్భంగా విజయశాంతి ఏమన్నారంటే.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాలన రాక్షసుల చేతుల్లోకి వెళ్లిందని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ చేతుల్లోకి వెళితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. బీజేపీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి ఎందరో సమర్థవంతమైన నేతలు ఉన్నారని చెప్పారు. తెలంగాణలో సంజయ్ వంటి నేత ఉన్నారని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకునేందుకు ఆయన పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.
కల్యాణి అయినా సక్సెస్ అయ్యేనా?
సినీ రంగానికి చెందిన పలువురు నటులు రాజకీయాల్లోకి వస్తున్నా సక్సెస్ అయిన నేతలు మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. గత కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన తెలుగు నటి మాధవి లత.. ఏ మేర విమర్శల పాలయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక చిరంజీవి సహా పవన్ కల్యాణ్, విజయశాంతిలు కూడా ఏ మేర విఫలం అయ్యారో తెలుగు ప్రజలు కళ్లారా చూశారు. ఇలాంటి నేపథ్యంలో కనీసం కరాటే కల్యాణి అయినా రాజకీయాల్లో రాణిస్తారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే సరిగ్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ.. కరాటే కల్యాణి వ్యూహాత్మకంగానే బీజేపీలో చేరినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మా ఎన్నికల్లో తాను పోటీ చేసే దిశగా కరాటే కల్యాణి సాగుతున్నారని, అందులో భాగంగానే ఆమె ముందుగా బీజేపీలో చేరారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- మెగాస్టార్ ఎంట్రీ.. ‘మా’కు తక్షణ ఎన్నికలే