మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్ల విషయంలో విదేశాలతో అనుసరిస్తున్న వైఖరి కారణంగా భారత్ లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.ఈ మేరకు జాతీయంగా, అంతర్జాతీయంగా పలు విశ్లేషణలు వస్తున్నాయి.వాటిని పరిశీలిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు కంపెనీల నుంచి వ్యాక్సిన్ల కొనుగోలు కోసం కేంద్రం ప్రత్యేక పాలసీని రూపొందించాల్సింది పోయి రాష్ట్రాలకు ఆ బాధ్యత వదిలిపెట్టడాన్ని అంతర్జాతీయ కంపెనీలు తప్పబడుతున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రాష్ట్రంతో వ్యాక్సిన్ తయారీ కంపెనీలు భేరసారాలు కుదుర్చుకోవాలన్నా,డీల్స్ చేసుకోవాలన్నాసాధ్యమయ్యే పని కాదు.కేంద్రంతో చర్చలు,సమావేశాల ద్వారా మాత్రమే దేశానికి వ్యాక్సిన్ సరఫరా చేసే విషయంలో ఒప్పందం జరిగే అవకాశం ఉంటుంది.ఈ విషయం ఇప్పటికే అర్థమైనా మోదీ ప్రభుత్వం మాత్రం చొరవ చూపించడం లేదు.ఈ కారణంగానే ఫైజర్,మొడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి కంపెనీల వ్యాక్సిన్లు దేశంలో అందుబాటులోకి తెచ్చే విషయంలో జాప్యం జరుగుతోంది.మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు గ్లోబల్ టెండరు పిలిచినా స్పందన రాకపోవడమే అందుకు నిదర్శనం.ఇక పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కోసం మొడెర్నా కంపెనీని సంప్రదించగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే తాము ఒప్పందం కుదుర్చుకుంటామని,రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకోబోమని తేల్చి చెప్పింది.పలు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తుతోంది.
Must Read ;- దిగజారిన మోదీ ప్రతిష్ట.. ఎందుకో తెలుసా?
వ్యాక్సిన్ల లభ్యత తక్కువగా ఉన్నందున..
ప్రస్తుత పరిస్థితతుల్లో వ్యాక్సిన్ల ఉత్పత్తి,లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో కంపెనీలు కూడా త్వరితగతిన,రిస్క్ లేని ఒప్పందాలు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తాయి.ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ల కోసం టెండర్లు పిలుస్తున్న తరుణంలో,జనాభా ఎక్కువ ఉన్న భారత్‌లో మాత్రం రాష్ట్రాలకు ఆ బాధ్యత అప్పజెప్పారు.భారత్‌లో అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలంటే కనీసం 29 ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుందని,అది సాధ్యమా అనే ప్రశ్న కంపెనీల్లో తలెత్తుతోంది.ఇక ఆఫ్రికా దేశాలు అన్నీ కలిపి ఆఫ్రికన్ యూనియన్ ట్రస్ట్‌గా ఏర్పాటై గ్లోబల్ టెండర్లను పిలిచాయి. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నుంచి 220 మిలియన్ డోసుల వ్యాక్సిన్లకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఇవే కాకుండా ఐరోపా ఖండంలోని 27 దేశాలు ఒక్కటై గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్ల కోసం ఒప్పందాలు కుదర్చుకున్నాయి. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఇందుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత అప్పజెప్పడం గమనార్హం.
తొలుత ఆయా దేశాలకు ప్రాధాన్యం..
అమెరికాతో పాటు ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్తత్తి చేస్తున్న కంపెనీలు తొలుత ఆయా దేశాలకు ప్రాధాన్యం ఇస్తాయి. తరువాతే బయటి దేశాలకు ఎగుమతి చేస్తాయి.ఇది జరగాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది.అయితే ప్రపంచంలోని చిన్న దేశాలు కూడా వ్యాక్సిన్ల కొనుగోలు కోసం ముందుంటే భారత్ మాత్రం తాత్సారం చేస్తోంది.కొవిడ్ సెకండ్ వేవ్‌తో అతలాకుతలం అవుతున్నా భారత ప్రభుత్వ పాలసీలో మార్పు లేదు.వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే రానున్న ఐదు నెలల్లో 220 కోట్ల డోసుల వ్యాక్సిన్లు సేకరిస్తామని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వ్యాఖ్యానించడం గమనార్హం.అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం కుదర్చుకున్న ఒప్పందాలు,ఆర్డర్లు,విస్తరణ ప్రక్రియలు అన్నీ పరిశీలించినా 220 కోట్ల వ్యాక్సిన్ల సేకరణ అసాధ్యమని చెప్పవచ్చు.ఇక భారత్ బయోటెక్,సీరమ్ సంస్థలు రెండూ కలిపి 500 మిలియన్ల వ్యాక్సిన్లు మాత్రమే నెలకు తయారు చేయగలుగుతాయి.స్ముత్నిక్ వ్యాక్సిన్ల లభ్యతపై ఇంకా క్లారిటీ లేనందున అవి ఎన్ని అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి.ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా పర్యటనలో ఎన్ని వ్యాక్సిన్ల కోసం ప్రయత్నిస్తారో చూడాలి.
Must Read ;- అమెరికాలోనూ త్వరలో కొవాగ్జిన్.. US FDAకు మాస్టర్ ఫైల్ సమర్పణ