హమ్మయ్య,, ‘గాలి’ పోగేస్తున్నారు. ఆక్సిజన్ దొరక్క ఇప్పటిదాకా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగు ప్రజలకు నిజంగా ఇది శుభవార్తే. ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చేసినట్టే. మెగాస్టార్ వాయు వేగంతో ఆక్సిజన్ బ్యాంకులకు శ్రీకారం చుడితే, సోనూ సూద్ మెరుపు వేగంతో రంగంలోకి దిగిపోయారు. ఇక అందరికంటే ముందు దర్శకుడు సుకుమార్ తన సొంతూరులోనే ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పి ఆదర్శప్రాయులయ్యారు. అతి వృష్టి, అనావృష్టి లాగా ఉంది మన పరిస్థితి. వ్యాక్సిన్లది అదే పరిస్థితి.
ప్రస్తుతం వ్యాక్సిన్ల అనావృష్టి కొనసాగుతోంది. అది కూడా పూర్తిస్థాయిలో వచ్చేస్తే ఇక ఆక్సిజన్ అవసరమే ఉండదు. అసలు పరీక్షల్లో ఆనందయ్య మందు పాసైతే ఆక్సిజన్ల ప్లాంట్ల అవసరమే ఉండదు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మనం ఒడ్డున పడ్డట్టే. ముందు మెగాస్టార్ చిరంజీవి బయటికొచ్చారు.. ఇది అంతకన్నా విశేషం. ఆయన ఫీల్డులోకి దిగి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మిగతా హీరోలు కూడా ఆ నాలుగు గదుల నుంచి బయటికి వచ్చి ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడితే ఎంత బాగుంటుంది.
ఆక్సిజన్ ప్లాంట్లు కాదు బ్యాంకులు
కరోనా క్రైసిస్ ఛారిటీతో గత ఏడాది ఎంతో మందిని ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈసారి చేపట్టిన మెగా కార్యక్రమమే ప్రతి జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ముందు ప్రకటించినట్టుగానే వారంలోగానే ఆయన ఈ ఏర్పాటు చేశారు. జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పడ్డాయి. గుంటూరు నుంచి దీనికి శ్రీకారం చుట్టారు. అనంతపూర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు బుధవారం సాయంత్రానికి ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చేస్తాయి.
హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ఆఫీసుగా పనిచేస్తుంది. ఇక్కడి నుంచి ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లను, తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్ సన్ ట్రేటర్లను పంపించారు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కూడా ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ఎవరైనా తమకు ఆక్సిజన్ కావాలని కోరగానే ఈ సిలిండర్లను పంపిస్తారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి పర్యవేక్షణలో ఈ ఆక్సిజన్ సరఫరా కొనసాగుతుంది. ఈ ఆక్సిజన్ ప్లాంట్లకు ఎంత ఖర్చవుతుందన్నిది చెప్పలేం. ఆక్సిజన్ అవసరాన్ని బట్టి ఇది ఉంటుంది. ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడానికైతే దాదాపు రూ. 40 లక్షల దాకా ఖర్చవుతుంది.
ఇది సిలింజర్ల పంపిణీ కాబట్టి ప్రజల వినియోగాన్ని బట్టి ఈ ఖర్చుఉంటుంది. మొత్తానికి ఇంత పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత మన తెలుగు హీరో చిరంజీవికే దక్కుతుంది. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ఘనత మాత్రం సోనూ సూద్ కు దక్కుతుంది. ఇద్దరూ చేసేది మంచి సేవగానే చూడాలి తప్ప ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది ముఖ్యం కాదు. నెల్లూరు జిల్లాలో సోనూ ఏర్పాటు చేసే ఒక్క ప్లాంటుకే కోటిన్నర ఖర్చవుతుందంటున్నారు. ఇది ఆక్సిజన్ బ్యాంకు కాదు ప్లాంటు.
ఇలాంటివి మన రాష్ట్రంలోనే రెండింటిని సోనూ ఏర్పాటుచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయబోతున్నారు. ఇక దర్శకుడు సుకుమార్ గురించి చెప్పాలి. ఆయన తన స్వగ్రామమైన రాజోలులో రూ. 40 లక్షల వ్యయంతో శాశ్వతమైన ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటుచేశారు. దీన్నుంచి ప్రతి రోజూ 80ఎల్పీఎం ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఆ పరిసర ప్రాంతాల వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రాయలసీమలోని ప్రభుత్వ ఆస్పత్రి రుయాలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు కానుంది.
ఇటీవల తమిళనాడు నుంచి ప్రాణవాయువు రావడం ఆలస్యం కావడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో గాంధీ మెడికల్ కళాశాల పూర్వవిద్యార్థులు ఈ ప్లాంటు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. ఇక ఇవన్నీ కాకుండా గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలో గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసుకునే ప్లాంటు నిర్మాణానికి భీజం పడింది. దీన్ని ప్రెజర్‌స్వింగ్ అడాప్షన్(పీఎస్‌ఏ) ప్లాంట్లు అంటారు. ఇది కూడా కార్యరూపం దాలిస్తే ఇక మనకు ఆక్సిజన్ కొరత అంటూ ఉండదు. మనకు గాలి బాగానే పోగుపడుతుందన్నది వాస్తవం.
-హేమసుందర్
Must Read ;- ఏపీ నుంచి సోనూ ఆక్సిజన్ ప్లాంట్లకు శ్రీకారం