( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
డిమాండ్ ఉన్నఏ వస్తువైనా, ఏ అంశమైనా ఆర్థిక బలం, అంగ బలం, అధికార బలం ఉన్నవారి కాళ్ళ చెంతకు ముందుగా చేరుతుంది. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనం మొదలుకుని… క్రికెట్ మ్యాచ్‌లో పాస్‌ల వరకు పైరవీలతోనే దక్కించుకుంటున్న ఆనవాయితీ ఏళ్ల తరబడి కొనసాగుతోంది. మరి అందుకు కరోనా వైరస్ వ్యాక్సిన్ అతీతమా? అన్న సందేహాలు ప్రస్తుతం అన్నివర్గాల్లో మొదలైంది. 130 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్ సరఫరా చేయడం అతి పెద్ద ప్రక్రియ. ఇందుకోసం ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని దశల్లో పూర్తవుతుంది? ఎంత కాలం పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది? వ్యాక్సినేషన్ తరువాతి దశలో ఎవరెవరికి ప్రాధాన్యత దొరుకుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇంకా రావాల్సి ఉంది. అయితే తొలిదశ వ్యాక్సిన్ పంపిణీకి దేశవ్యాప్తంగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్రం వ్యాక్సిన్లు సరఫరా చేయడమే ఆలస్యం.. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ చేసేందుకు శిక్షణ కార్యక్రమాన్నికూడా సిబ్బందికి ఇచ్చారు.
Must Read ;- బ్రిటన్‌లో విజృంభిస్తున్న కొత్తరకం కరోనా.. మళ్లీ లాక్ డౌన్..
అర్హులకు మాత్రమే ఇస్తారా?
తొలి విడత వ్యాక్సినేషన్ కేవలం అర్హులకు మాత్రమే ఇస్తారా? లేక పైరవీలకు తలొగ్గి ఇతర వర్గాలకు పంపిణీ చేస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేందుకు సంసిద్ధత, ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సిద్ధం చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్.. మినహా మిగిలిన వర్గాలు.. రెండవ దఫా పంపిణీ వరకు వేచి చూస్తారా? అందులోనూ ఆ వర్గాలకు స్థానం లేకపోతే మరో దశ వరకు వేచి ఉంటారా? అంటే దాదాపుగా అసాధ్యమనే మెజార్టీ వర్గాలు చెబుతున్నాయి. సరాసరి లక్ష టీకాల్లో 40 వేల వరకు ప్రముఖుల వశం అవుతాయని ప్రస్తుత పరిస్థితులను బట్టి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏ ఉన్నతాధికారి రికమండేషన్ ను అధికారులు కాదనగలరు.. ఏ వ్యాపారవేత్త ఆబ్లిగేషన్‌ను తిరస్కరించగలరు. ఇలా సమాజంలో పలుకుబడి ఉన్నఎన్నోవర్గాలు వ్యాక్సిన్ కోసం తమ హోదాను చూపించకుండా ఉంటారా? ప్రభుత్వం నిర్దేశించినట్టు అర్హులకు అందేవరకూ వేచి చూస్తారా? అసలు ఈ ప్రక్రియ అంత సులభమా? లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయగలరా? ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రస్తుతం ప్రజల మదిని దొలిచేస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల తరహాలో ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు జారీ అయితే గాని ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు.
Also Read ;- టీకా జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడం ఎలా?
జిల్లాల వారీగా ఏర్పాటు పూర్తి..
కోవిడ్ -19 వాక్సినేషన్ ప్రక్రియకు అన్ని జిల్లాల్లో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను పూర్తి చేశారు. ఈ మేరకు జిల్లాల వారీగా టాస్క్ ఫోర్స్ ఇమ్యునైజేషన్ (DTFI) కమిటీలు ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ను మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లు, అంగన్ వాడిలు, ఆశా వర్కర్లు , ఎ.ఎన్.ఎమ్.లకు వేస్తారు.రెండవ దశలో 50 ఏళ్ల వయస్సు దాటిన వారికి, కోమార్బిడిటీస్ వున్న50 ఏళ్ల వయస్సులోపు వారికి ప్రాధాన్యత ఇచ్చి వాక్సినేషన్ చేస్తారు. ఒక్క విశాఖ జిల్లాలోనే ఫ్రంట్ లైన్ వర్కర్స్ 60 వేల మంది ఉన్నారు. శానిటరీ వర్కర్లు, అంబులెన్స్ డ్రైవర్లు(104,108), ఆసుపత్రులలో పనిచేస్తున్న టెక్నిషియన్లు, పరిపాలన సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్, యం.బి.బి.ఎస్ డాక్టర్లు, స్పెషలిస్టు డాక్టర్లు వీరందరికీ తొలిదశలో టీకాలు వేయనున్నారు.
అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో సి.డి.పి.ఒ.లు, సూపర్ వైజర్లు , అంగన్‌వాడి వర్కర్లు, హెల్పర్లు, పంచాయతీరాజ్ శాఖలో స్వీపర్లు, విలేజ్ వాలంటీర్లు, జి.వి.యం.సి, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలలో స్వీపర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఇన్స్పెక్టర్లు నుండి ఉన్నత స్థాయి వరకు సిబ్బంది, వీరందరి వివరాలు సిద్ధంగా ఉంచారు. జిల్లాలో పెద్ద ఎత్తున స్టోరేజి పాయింట్లను (గోడౌన్‌లు) ఏర్పాటు చేశారు.
Also Read ;- టీకా పంపిణీకి కేంద్రం, రాష్ట్రాల అత్యవసర ఏర్పాట్లు