ఏపీలో ఉన్న కంపెనీలను, పోర్టులను అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు బాట పట్టిస్తోంది. ఇప్పటికే గంగవరం మేజర్ పోర్టును అదానీ గ్రూపు దక్కించుకోగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే రామాయపట్నం పోర్టును జగన్ సర్కారు అరబిందో గ్రూపునకు అప్పజెప్పింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఓ వైపు విశాఖలో 40రోజులకు పైగా ఉద్యమం నడుస్తున్న సమయంలోనే ఈ కార్యకలాపాలు జరిగాయి. అయితే విశాఖ ఉక్కు సంస్థకు సంబంధించి మరో అంశంపైనా చర్చ నడుస్తోంది. విశాఖ ఉక్కు సంస్థను అదానీ గ్రూపునకు అప్పజెప్పేందుకు రంగం సిద్ధం అవుతోందనే అంశంపై చర్చ నడుస్తోంది.
విశాఖ ఉక్కు సంస్థను ప్రైవేటుపరం చేసి తీరుతామని..
విశాఖ ఉక్కు సంస్థను ప్రైవేటుపరం చేసి తీరుతామని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన ఎంపీలే కాదు.. స్వయంగా సీఎ జగన్ లేఖ రాసినా.. కేంద్రం మాత్రం స్పందించలేదు. ఆ ఒక్కటే కాదు.. సీఎ జగన్ ఏ విషయంలో లేఖ రాసినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదనే విమర్శలూ వస్తున్నాయి. ఈ తరుణంలోనే విశాఖ ఉక్కు సంస్థ ప్రైవేటీకరణ ఆగదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడంతో ఉద్యమం కొనసాగుతోంది.
అదానీ గ్రూపు ప్రతినిధులు ఉక్కు కర్మాగారం సందర్శన?
అయితే పోస్కో కంపెనీ కోసం విశాఖ ఉక్కు సంస్థను ప్రైవేటుపరం చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటివరకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ కూడా పోస్కో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. కడప జిల్లాలో లేదా శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలో పోస్కోకు భూములు ఇస్తామని వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదించినట్లు వార్తలూ వచ్చాయి. ప్రస్తుతం ఈ కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అదే సమయంలో వారం క్రితం అదానీ గ్రూపు కంపెనీ ప్రతినిధులు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కంపెనీ పరిస్థితి, యంత్రాల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం అంచనా, భూముల లభ్యత అంశాలపై చర్చించినట్లు సమాచారం. దీంతోపాటు ప్రైవేటీకరణ జరిగితే ఎదురయ్యే ఇబ్బందులు, కార్మికుల హక్కులు, భూ యాజమాన్య వివాదాలు, తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కంపెనీపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పందన లేదని ఇప్పటికే కేంద్రం చెప్పిన నేపథ్యంలో అదానీ గ్రూపు విశాఖ ఉక్కు సంస్థ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
ఏక కాలంలో ఏపీలో మూడు..
గంగవరం పోర్టులో డీవీఎస్ రాజు కుటుంబానికి చెందిన 58.1 శాతం స్టేక్‌ను 3,604 కోట్ల రూపాయలతో అదాని గ్రూప్ దక్కించుకుంది. దీంతోపాటు విశాఖ ప్రత్యేక ఆర్థిక మండలిలో డేటా సెంటర్ , బిజినెస్ పార్క్, రిక్రియేషన్ సెంటర్, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు గాను 500ఎకరాల భూమిని కేటాయించేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో ఈ ప్రతిపాదన వచ్చినా..వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అదానీ గ్రూపు వెనక్కి తగ్గినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూపు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రూ.14వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించినట్టు సమాచారం. ఇక విశాఖ ఉక్కు కంపెనీని దక్కించుకుంటే.. అదానీ కంపెనీ విశాఖ తీరాన్ని చేజిక్కించుకున్నట్లు భావించాల్సి ఉంటుంది.
విశాఖ ఉక్కుపై సైలెంట్..
ఓవైపు వివిధ ప్రాజెక్టుల విషయంలో అదానీ గ్రూపుతో చర్చలు జరుపుతూనే మరోవైపు విశాఖ స్టీల్‌ను ప్రైవేటు పరం చేసేందుకు అంగీకరించేది లేదని వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. విశాఖ ఉక్కు కంపెనీని అదానీ గ్రూపు ప్రతినిధులు సందర్శించిన అంశంపై ఇటు సదరు కంపెనీ లేదా విశాఖ స్టీల్ అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Must Read ;- నిబంధనలు జాన్తా నై.. అల్లుడి అరబిందోకే కాకినాడ సెజ్ కూడా