పారిశ్రామిక నగరం విశాఖ నుంచి ఒక్కో పరిశ్రమా తరలిపోతోంది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక బహుళజాతి సంస్థలు తమ పెట్టుబడులను నిలిపివేశాయి. ఇప్పటికే విశాఖలో కొనసాగుతున్న కంపెనీలు కూడా క్రమంగా తరలించుకుపోయే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. విశాఖలో ఐటీ బీజాలు వేసిన హెచ్ ఎస్ బీ సీ కూడా క్రమంగా తరలిపోతోంది. పదిహేను సంవత్సరాల కిందటే విశాఖలో ఐటీఈఎస్ కంపెనీ ఏర్పాటు చేసి 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన హెచ్ ఎస్ బీ సీ నిదానంగా ఖాళీ అవుతోంది. దీంతో విశాఖలో ఐటీకి పునాదులు వేసిన కంపెనీగా పేరున్న హెచ్ ఎస్ బీ సీ తరలిపోవడంతో ఇక కొత్తగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనుమరుగవుతున్నాయని నిరుద్యోగుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా వచ్చేది లేదు- ఉన్నవి కూడా ఖాళీ
విశాఖ నగరానికి కొత్త పెట్టుబడులు రాకపోగా ఉన్న కంపెనీలు కూడా ఖాళీ చేసి వెళ్లిపోతున్నా ప్రభుత్వానికి పట్టినట్టు కనిపించడం లేదు. ఇప్పటికే ఏపీలో చదువుకున్న వారికి ప్రైవేటు రంగంలో ఒక్క ఉద్యోగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పెట్టుబడులన్నీ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు తరలిపోవడంతో ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని నిరుద్యోగులు వాపోతున్నారు. ఏపీలో టీడీపీ హయాంలో 30 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు 600 కంపెనీలు ఎంవోయూ చేసుకున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో వారంతా పునరాలోచనలో పడిపోయారు. ఏపీలో పెట్టుబడులకు అనువైన వాతావరణం లేకపోవడంతో ఇక వారంతా హైదరాబాద్ లాంటి నగరాల బాట పడుతున్నారు.
Must Read ;- విశాఖలో కృష్ణా జలాల యాజమాన్య బోర్డు అందుకేనా?
విశాఖకు లులూ సంస్థ బైబై
విశాఖలో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో భారీ మాల్ నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో బహుళజాతి సంస్థ లులూ ఒప్పందం చేసుకుంది. ఇందుకు అవసరమైన భూమిని ప్రభుత్వం సమకూర్చింది. పనులు మొదలు పెట్టే సమయంలో ఏపీలో ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. వెంటనే లులూ సంస్థకు లీజుకిచ్చిన 11 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. దీంతో లులూ సంస్థ ద్వారా రావాల్సిన 2 వేల ఉద్యోగాలు లక్నోకు తరలిపోయాయి.
అదానీ డేటా సెంటర్ కూడా
రూ.30 వేల కోట్ల భారీ పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రముఖ సంస్థ అదానీ గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వైసీపీ అధికారంలోకి రావడంతో వారు కూడా చిన్నగా విశాఖను వీడిపోయారు. ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా, రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేకపోవడంతో అనేక మంది పెట్టుబడిదారులు ఆలోచనలో పడ్డారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. కొత్తగా పెట్టుబడులు రాకపోగా ఉన్నవారు కూడా చిన్నగా ఖాళీ చేసి అనువైన ప్రాంతాలకు తరలిపోవడం నిరుద్యోగులకు శాపంగా మారిందనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.
అక్కడ సచివాలయం పెడతారా?
విశాఖనగరంలో కీలక ప్రాంతంలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న హెచ్ ఎస్ బీ సీ తన ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తోంది. క్రమంగా విశాఖలో ఐటీఈఎస్ కంపెనీని మూసివేయాలని హెచ్ ఎస్ బీ సీ అధికారులు భావిస్తున్నారు. పదిహేను సంవత్సరాల కిందట విశాఖలో ఏర్పాటైన కంపెనీని వైసీపీ నేతలే బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారా అనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ నగర పాలక సంస్థకు కూడా యాజమాన్య హక్కులు ఉన్న ఆ భారీ భవనాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలనా రాజధానిని విశాఖ తరలించిన పక్షంలో అక్కడ వివిధ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. విశాఖలో సచివాలయం నిర్మించే వరకు హెచ్ ఎస్ బీ సీ ఖాళీ చేసిన భవనంలో తాత్కాలికంగా కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు.
అన్నీ చెక్కేస్తున్నాయి
వైసీపీ నాయకుల విధ్వంసం, బెదిరింపుల కారణంగా ఏపీ నుంచి అనేక కంపెనీలు తరలిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి మొహం చూసి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదని, వైసీపీ పాలన నిరుద్యోగులకు శాపంగా మారిందని లోకేష్ ధ్వజమెత్తారు. 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన హెచ్ ఎస్ బీ సీ లాంటి కంపెనీలు కూడా విశాఖను వదలి పారిపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
Must Read ;- ఉగాది నాటికి రాజధాని విశాఖకు తరలింపు