బుల్లితెరపై సంచలనం సృష్టించిన ధారావాహికలలో ‘చిన్నారి పెళ్లి కూతురు‘ ఒకటిగా కనిపిస్తుంది. ఈ సీరియల్ ద్వారానే ‘అవికా గోర్’ పరిచయమైంది. అప్పట్లో ఎక్కడ చూసినా ఈ అమ్మాయిని గురించే మాట్లాడుకునేవారు. అంతలా ప్రతి ఇంటికి .. ప్రతి మనసుకి ఈ అమ్మాయి దగ్గరైంది. ఆ సీరియల్ ద్వారా ఈ అమ్మాయికి వచ్చిన క్రేజ్, ఏకంగా సినిమాల్లోనే అవకాశాలు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా టాలీవుడ్ ఈ అమ్మాయిని బాగా ఆదరించింది. తెలుగు తెరకి అవికా గోర్ ‘ఉయ్యాలా జంపాలా’ సినిమా ద్వారా పరిచయమైంది.
‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో ఈ అమ్మాయిని చూసిన ప్రేక్షకులు, అబ్బో అప్పుడే చాలా పెద్దదైపోయిందని అనుకున్నారు. ఆ ముఖంలో పసితనపు ఛాయలు పోలేదని చెప్పుకున్నారు. టీనేజ్ ఏజ్ గ్రూప్ లో సాగే ప్రేమకథలకు ఒక మంచి అమ్మాయి దొరికినట్టేనని ఇండస్ట్రీ కూడా అనుకుంది. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో పాటు ఆ తరువాత అవికా చేసిన ‘సినిమా చూపిస్త మావా’ .. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలు హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయాయి. దాంతో ఇక పిల్లను పట్టుకోవడం కష్టమేనని అనుకున్నారు. కానీ హఠాత్తుగా గ్యాప్ తీసేసుకుని, ‘రాజుగారి గది 3’లో కనిపించింది .. కానీ ప్రయోజనం లేకూండా పోయింది.
ఎందుకనో తెలియదుగానీ అవికా గోర్ సిన్సియర్ గా తెలుగు సినిమాలపై దృష్టిపెట్టలేకపోయింది. వెతుక్కుంటూ వస్తున్న అవకాశాల కంటపడకుండా తప్పుకుంది. దాంతో సహజంగానే అవకాశాలు కొత్త అమ్మాయిలను వెతుక్కుంటూ వెళ్లిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఓ తెలుగు సినిమాకి సంబంధించి ఈ అమ్మాయి పేరు వినిపిస్తోంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ ‘థ్యాంక్యూ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉంటుందట. ఒక కథానాయికగా అవికాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇకపై తాను గ్లామరస్ గా కనిపించడానికి కూడా సిద్ధమేనన్నట్టుగా అవికా సిగ్నల్స్ ఇస్తోంది. ఇకనైనా ఈ పిల్ల దాగుడుమూతలు ఆపేసి సిన్సియర్ గా చేస్తుందా? రీ ఎంట్రీలో దుమ్మురేపేస్తుందా? అనేది చూడాలి.
Mu stRead ;- జోడు గుర్రాలపై జోరుమీదున్న బ్యూటీ