బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘అంతిమ్’. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన కూతురు సయీ మంజ్రేకర్ కూడా నటిస్తోంది. ఇక ఇందులో సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. తిరిగి నవంబర్ నెలలో మొదలైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఆయుష్ శర్మపై కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉన్నారు దర్శకుడు మహేష్. అయితే మొదట ఆయుష్ శర్మకి జోడిగా హీరోయిన్ అవికా గోర్ ను ఓకే చేశాడు దర్శకుడు.
‘ఉయ్యాల జంపాల, లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావా సినిమాలతో అవికా గోర్ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె హిందీలో ‘బాలికా వధు’ (తెలుగులో చిన్నారి పెళ్ళికూతురు) సీరియల్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తెలుసు. తాజా సమాచారం ప్రకారం అవికా గోర్ స్థానంలో మహిమా మక్వానాను తీసుకున్నారని తెలుస్తోంది. ఈమె కూడా ఒక టీవీ నటి. అనేక టీవీ సీరియల్స్ ద్వారా అమ్మడు బాగా పాపులర్ అయ్యింది. ఆమె అయితే ఆయుష్ శర్మ సరసన కరెక్ట్ గా సరిపోతుందని దర్శకుడు మహిమా మక్వానాను ఎంపిక చేశారని సమాచారం.
త్వరలోనే ఈ అమ్మడు షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లు టాక్. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో సల్మాన్ ఖాన్ ఒక పవర్ ఫుల్ సిక్కు పొలీసు అధికారిగా నటిస్తున్నాడు. ఈమధ్యనే ‘అంతిమ్’ సినిమా షూటింగ్ లో తీసిన ఒక వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు సల్మాన్ బావ ఆయుష్. చిత్రం కోసం వేసిన కూరగాయల మార్కెట్ సెట్ లో సల్మాన్ ఖాన్ తలపాగా ధరించి, ఫార్మల్ డ్రెస్‌లో నడుచుకుంటూ వెళుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: పవర్ స్టార్ సినిమాకు బాలీవుడ్ సెంటిమెంట్