కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి ఎన్నో రోజులు లేవు. ఈ ఏడాది కరోనా కారణంగా సినిమా అనే వినోదానికి దూరమైన చాలామంది, ఎప్పుడెప్పుడు పూర్తిస్థాయిలో థియేటర్స్ ఓపెన్ అవుతాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా అలాంటి ఆనందకరమైన సమయం కోసమే కాచుకుని కూర్చున్నారు. కొత్త ఏడాదిలో ఎంట్రీ ఇచ్చే కథానాయికలంతా కూడా ఇదే సమయం కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది విజయ్ దేవరకొండ సరసన నాయికగా అనన్య పాండే తెలుగు తెరకి పరిచయం కానుంది. అలాగే ‘రొమాంటిక్’ సినిమాతో కేతిక శర్మ .. ‘ఉప్పెన’ సినిమాతో కృతి శెట్టి ప్రేక్షకులను పలకరించనున్నారు.

Must Read ;- కొత్త రికార్డు నెలకొల్పిన ‘ఉప్పెన’ పాట
బాలీవుడ్ యూత్ హృదయాలను దోచేసిన అనన్య పాండే, చాలా ఫాస్టుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందుతున్న ‘ఫైటర్’ సినిమాలో ఆమె కథానాయికగా అలరించనుంది. పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమాలో, యాక్షన్ తో పాటు రొమాన్స్ పాళ్లు ఎక్కువగా ఉండనున్నాయి. అందువలన అనన్య పాండే అందచందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. ఈ కారణంగానే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండటం విశేషం.
ఇక పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా ‘రొమాంటిక్’ సినిమా రూపొందింది. అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీనేజ్ లవ్ స్టోరీగా నిర్మితమైంది. టైటిల్ లోనే రొమాన్స్ ఉండటం వలన యూత్ అంతా కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే కుతూహలంతో ఉన్నారు. ఈ సినిమా పోస్టర్ చూస్తేనే కుర్రకారు కలల్లో నుంచి పొగలు పుట్టుకొచ్చాయంటే, ఈ సినిమా వాళ్లని ఎంతగా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తరువాత కేతిక శర్మ కెరియర్ గ్రాఫ్ మారిపోతుందనే అభిప్రాయాలు అభిమానుల మాటగానే కాదు, ఇండస్ట్రీలోను వినిపిస్తున్నాయి.
ఇక ఈ ఇద్దరి అమ్మాయిలకంటే కృతి శెట్టి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ‘ఉప్పెన’ సినిమాకి సంబంధించి వచ్చిన వీడియోల్లో ఈ అమ్మాయి నవ్వు చూసినవాళ్లు .. ఇదేదో మన్మథ మాయే అనుకుంటున్నారు. వెండితెరపై ఈ బంగారు బొమ్మను చూడాలని ఆరాటపడుతున్నారు. ‘ఉప్పెన’ విడుదల ఆలస్యమైతే వాళ్లంతా బెంగపడేలానే కనిపిస్తున్నారు. ఆ అమ్మాయి కళ్లలో .. నవ్వులో ఏదో మేజిక్ ఉందని చెప్పుకుంటున్నారు. మొదటి సినిమా విడుదలకి ముందే ఈ అమ్మాయి, అందరి హీరోయిన్ల అభిమానులను ఎగరేసుకుపోవడం ఖాయమనుకుంటున్నారు.
అనన్య పాండే .. కేతిక శర్మ .. కృతి శెట్టి ఈ ముగ్గురూ కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ముగ్గురికీ కూడా తొలి సినిమాల విడుదలకి ముందే ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చేసింది. ఇక మిగిలిందల్లా ఆ క్రేజ్ కి ఆ సినిమాల హిట్ తోడవ్వడమే. అయితే ఈ ముగ్గురిలో ‘ఉప్పెన’ నాయిక కృతి శెట్టి దూకుడు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సొట్టబుగ్గల సుందరి మరో రెండు సినిమాల్లో అవకాశాలను అందుకుందట. ఇటు టాలీవుడ్ నిర్మాతలు .. అటు కోలీవుడ్ నిర్మాతలు అమ్మడి డేట్స్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నట్టు వినికిడి. ఇదంతా చూస్తుంటే వచ్చేది ‘ఉప్పెన’ కాదు .. సునామీనే అనిపించడం లేదూ!
Also Read ;- వకీల్ సాబ్, ఉప్పెన రిలీజెస్ పై క్లారిటీ వచ్చేసింది..!











